దేశంలో పెట్రోధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆకాశమే హద్దు.. అన్నట్టుగా చెలరేగిపోతున్నాయి రోజువారీ పెంపుతో పెట్రో ధరలు. అయినా, రాష్ట్రాలు ఈ విషయమై కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలేదు. కరోనా సహా పలు అంశాలపై రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాయడం చూస్తున్నాం. మరి, ప్రజలు పెట్రో ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంటే, రాష్ట్రాలు ఎందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోతున్నాయి.? అంటే, దానికీ బలమైన కారణం లేకపోలేదు. కరోనా కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది.
ఈ పరిస్థితుల్లో పెట్రో ధరల పెరుగుదల రాష్ట్రాలకు కొంత ఊరట కలిగిస్తోంది. కేంద్రం కూడా అంతే. వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నా, రాష్ట్రాల ఖజానాకి ఆ ధరల పెరుగుదల చాలా ఉపయోగపడుతోంది. అందుకే, ఇటు రాష్ట్రాలు.. అటు కేంద్రం.. పెట్రో ధరల పెరుగుదలపై హ్యాపీగానే వున్నాయి. ప్రజలెలా పోయినా ప్రభుత్వాలకి అనవసరం.. ప్రభుత్వ ఖజానా నిండటమొక్కటే ప్రభుత్వ పెద్దలకు అవసరం.. అన్న విమర్శలు రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్నాసరే, తమకేమీ పట్టనట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
పెట్రోధరల పెరుగుదల అంటే కేవలం పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనదారులకే సమస్య కాదు. రవాణా రంగంపై పెను ప్రభావం పడుతుంది పెట్రో ధరల పెరుగుదలతో. తద్వారా అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత యెత్తుకి పెరుగుతాయి. అయినాగానీ, ఇవేవీ ప్రభుత్వాలకి అవసరం లేని విషయాలు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. వాటాలేసుకుని మరీ పన్నుల రూపంలో వాహనదారుల జేబులకు చిల్లలు పెట్టేస్తున్నాయి. అందుకే, ఏ రాష్ట్రమూ పెట్రో ధరల విషయమై కేంద్రానికి లేఖ రాయలేదు. రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం, కేంద్రమే పన్నులు తగ్గించాలని రాష్ట్రాలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటాయంతే. మధ్యలో సామాన్యుడే నలిగిపోవాలి.