చంద్రబాబు ప్రస్తుతం పార్టీలో కొన్ని మార్పులు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దానిలో భాగంగానే ముందుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలని.. అలాగే పార్టీలో యువరక్తం ఉండాలని ఆలోచిస్తున్నారు. పార్టీని ప్రతిష్ఠం చేయకపోతే.. భవిష్యత్తులో పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ముందే గ్రహించిన చంద్రబాబు ఆదిశగా దిద్దుబాటు చర్యలను చేపడుతున్నప్పటికీ.. ఎందుకో అన్ని సరిగ్గా జరగడం లేదట.
దానికి కారణం నారా లోకేశ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నారా లోకేశ్ కొంచెం దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. కొన్ని విషయాలకు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నాడు. అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు నాయుడు భావించారని.. వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఉన్న కళా వెంకట్రావును తప్పించి… అచ్చెన్నాయుడిని నియమించి.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే అచ్చెన్నాయుడికి పట్టాభిషేకం అని కూడా అన్నారు.
కానీ.. తర్వాత ఏమైందో తెలియదు.. దాని గురించే టీడీపీ తమ్ముళ్లు మాట్లాడటం లేదు. అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే.. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడం.. నారా లోకేశ్ కు ఇష్టం లేదట. అంటే.. తన తండ్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను కూడా లోకేశ్ వ్యతిరేకిస్తున్నారా? అంటూ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.
అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయితే తనను ఎక్కడ డామినేట్ చేస్తాడో అని లోకేశ్ భయపడ్డాడని… అందుకే అచ్చెన్నను వ్యతిరేకిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు దూకుడు ముందు తన పని అంతే అని లోకేశ్ భయపడి చంద్రబాబుతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు లోకేశ్ కు సన్నిహితుడిగానే ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య మంచి బంధం ఉంది. అందుకే… లోకేశ్.. అచ్చెన్నాయుడిని వ్యతిరేకిస్తున్నాడు అంటూ తెలుస్తోంది.
చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయానికి కూడా అడ్డుచెప్పని లోకేశ్.. దీనికి అభ్యంతరం వ్యక్తం చేశాడంటే.. లోకేశ్ కూడా తన దూకుడుతనాన్ని పెంచాడని.. రాబోయే ఎన్నికల్లో కాస్త దూకుడుగానే వ్యవహరిస్తాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.