Nandamuri Family : కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఓ జిల్లాకి, అందున్నా ప్రస్తుత కృష్ణా జిల్లా నుంచి కొత్తగా ఏర్పడనున్న జిల్లాకి ఎన్టీయార్ పేరు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయంలో అధికార వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న వాదన లేకపోలేదు. అయితే, ప్రజా సంకల్ప యాత్రలోనే వైఎస్ జగన్, ఎన్టీయార్ జిల్లా అనే ప్రస్తావన తెచ్చారు. అప్పట్లోనే ఎన్టీయార్ పేరుతో చంద్రబాబు గనుక కొత్త జిల్లా ఏర్పాటు చేసి వుంటే, ఆ క్రెడిట్ టీడీపీలోకి వెళ్ళి వుండేది.
ఇక, వైసీపీ ప్రభుత్వం ఎన్టీయార్ జిల్లాని ప్రకటించాక, నందమూరి కుటుంబం ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు తటపటాయించింది. చివరికి ‘సంతోషం’ అన్నట్టుగా ఓ ప్రకటన విడుదల చేసి ఊరుకుంది నందమూరి కుటుంబం. ఈలోగా, వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నందమూరి కుటుంబాన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
‘స్వర్గీయ నందమూరి తారకరామారావుని ఆయన కుటుంబమే వెన్నుపోటు పొడిచింది. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం తప్ప.. ఏనాడూ స్వర్గీయ ఎన్టీయార్‌ని ఆయన కుటుంబం గౌరవించలేదు..’ అంటూ వైసీపీ అభిమానులు రకరకాల మీమ్స్ తయారు చేసి వదిలారు సోషల్ మీడియాలో.
ప్రధానంగా నందమూరి బాలకృష్ణతో సహా, ఇటీవల ఓ వివాదం విషయమై మీడియా ముందుకొచ్చి నానా యాగీ చేసిన నందమూరి కుటుంబ సభ్యులందరి ఫొటోలతో సోషల్ ర్యాగింగ్ జరిగింది.
కాగా, వైసీపీ తీరు అత్యంత అవమానకరంగా వుందనీ, కొద్ది రోజుల క్రితం స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని అత్యత అసభ్యకరంగా అవమానించారనీ, ఇప్పుడు మొత్తంగా నందమూరి కుటుంబాన్ని అవమానిస్తున్నారనీ, నందమూరి అభిమానులు వాపోతున్నారు. ఎవరి గోల వారిదే.!