Nagarjuna : సినిమా అన్నాక గాసిప్స్ సహజం. పైగా, అక్కినేని నాగార్జున విషయంలో గాసిప్స్ అంటే ఒకింత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆచి తూచి స్పందిస్తుంటుంది. కానీ, ఏమయ్యిందో.. ఈసారి నాగార్జునకి తెలుగు మీడియా పెద్ద షాకే ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో నాగార్జున తన కుమారుడు అక్కినేని నాగచైతన్య విడాకుల వ్యవహారంపై స్పందించాడనీ, తప్పంతా సమంతదేననీ, ఆమే తొలుత విడాకులు కోరిందనీ, దాంతో నాగచైతన్య విడాకులు ఇవ్వక తప్పలేదని నాగార్జున చెప్పాడనీ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
నాగార్జునని మీడియా కాంటాక్ట్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ, నాగార్జున నుంచి ఈ గాసిప్స్ విషయమై వివరణ తీసుకోకుండానే ఆ గాసిప్స్‌ని ప్రచారంలోకి తెచ్చేసింది తెలుగు మీడియా.. అందునా, ప్రముఖ మీడియా సంస్థలూ గొర్రెల మందలా వ్యవహరించాయన్న ఆరోపణలున్నాయి.
ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున తీవ్రంగా కలత చెందినట్టున్నాడు. ‘వార్తలు రాయండి.. రూమర్స్ ప్రచారం చేయొద్దు..’ అంటూ ఘాటుగా ఓ స్టేట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారమేననీ, తానెలాంటి కామెంట్స్ సమంత మీద చెయ్యలేదనీ నాగ్ వివరణ ఇచ్చుకున్నాడు.
కాగా, నాగార్జున మీద అక్కసుతో ఎవరో పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేసి వుంటారన్న చర్చ సినీ, మీడియా వర్గాల్లో జరుగుతోంది. వాళ్ళెవరన్నదానిపై తెరవెనుక కూపీ లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.