Surgical Strike : ఇక, తాజాగా బీజేపీకీ తెలంగాణ రాష్ట్ర సమితికీ మధ్య ‘సర్జికల్ స్ట్రైక్స్’ వ్యవహారంపై వివాదం నడుస్తోంది.

Surgical Strike : బీజేపీ ఎలా చెబితే అలా.! కుక్కను పట్టుకుని నక్క అనాలని బీజేపీ చెబితే, అలాగే అనాలి. అంతేగానీ, అది కుక్క కదా.? అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఏకంగా ‘దేశద్రోహులు’ అయిపోతారు. గత ఏడెనిమిదేళ్ళుగా దేశంలో ఇదే జరుగుతోంది.

రైతు చట్టాలతో దేశాన్ని ఉద్ధరించేస్తామని బీజేపీ చెబితే అదే నిజమని నమ్మాలి. కాదు, ఆ రైతు చట్టాల వల్ల రైతులకు మేలు జరగదు.. అని అదే బీజేపీ చెబితే, అది కూడా నిజమని ఒప్పుకోవాల్సిందే. రైతు చట్టాల వల్ల నష్టాలేమిటో తెలుసుకుంది కాబట్టే, మోడీ సర్కారు ఆ రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుని, ‘చూశారా మాకు రైతులంటే ఎంత అభిమానమో..’ అని చెప్పుకుంది. అంత అభిమానమైతే రైతు చట్టాలెందుకు తెచ్చారు.? అంటే, దానికి సమాధానముండదు.

సర్జికల్ స్ట్రైక్స్ విషయమై దేశ ప్రజానీకానికి నరేంద్ర మోడీ సర్కారు ‘వివరణ ఇవ్వాలి’ అన్న డిమాండ్ గతంలో కాంగ్రెష్ నేత రాహుల్ గాంధీ సహా చాలామంది రాజకీయ ప్రముఖులు తెరపైకి తెచ్చారు.
‘సైన్యం త్యాగాల్నే అనుమానిస్తున్నారా.? మీరంతా దేశద్రోహులు..’ అంటూ బీజేపీ విరుచుకుపడిపోయింది. నిజానికి, ఇక్కడ సైన్యాన్ని దేశంలో ఏ ఒక్కరూ ప్రశ్నించరు, వారిని కించపర్చరు. సమస్య, అది రాజకీయ సర్జికల్ స్ట్రైక్ కావడంతోనే.

భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ కాదు.. బీజేపీ చేయించిన సర్జికల్ స్ట్రైక్.. అని ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆ సర్జికల్ స్ట్రైక్ వ్యవహారాన్ని వాడేసుకున్నాక, ఆ సర్జికల్ స్ట్రైక్ గురించి రాజకీయ పార్టీలకు అనుమానాలు ఎందుకు రావు.? ఖచ్చితంగా వస్తాయి. ఇదే అనుమానాన్ని కేసీయార్ కూడా వ్యక్తం చేశారు.

కేసీయార్ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి (బీజేపీ నేత హిమంత) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే హిమంత, రాహుల్ గాంధీ తండ్రి ఎవరు.? అని ప్రశ్నించి వివాదాల్లోకెక్కిన విషయం విదితమే. రాజకీయాల్లో ఎంత నీఛానికైనా దిగజారిపోగలనని నిరూపించుకున్న హిమంతకి, కేసీయార్‌ని ప్రశ్నించే నైతిక హక్కు వుందా.?