కోవిడ్ నాటు మందు: ఎవరీ ఆనందయ్య.? ఎందుకింత పబ్లిసిటీ.?

Why much publicity and hype on Anandayya Medicine

Why much publicity and hype on Anandayya Medicine

కరోనా వైరస్‌ని నియంత్రిస్తుందనీ, కోవిడ్ రోగుల్ని బాగు చేస్తుందనీ ‘ఆనందయ్య నాటు మందు’ చుట్టూ జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. అసలు ఇంతవరకు ఆనందయ్య, తన నాటు మందుని ఎంతమందికి ఇచ్చాడు.? ఎంతమందిలో అది పనిచేసింది.? అన్న విషయాలపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఆనందయ్య అంటే జస్ట్ ఓ పేరు కాదు, అదొక బ్రాండ్ ఇప్పుడు. అవును, ఓ ప్లాస్టిక్ కవర్‌లో నల్లటి పదార్థాన్ని పెట్టి, ఆనందయ్య నాటుమందుగా అమ్మేస్తున్నారు. నిజానికి, ఆనందయ్య నాటు మందు తయారీ ఆగిపోయిందని ప్రభుత్వం చెబుతోంది.

ఆ మందుపై ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నది ప్రభుత్వం వాదన. పెద్దయెత్తున జనం ఆనందయ్య నాటు మందుకోసం చిన్న గ్రామం కృష్ణపట్నంపై పోటెత్తడంతో, మందు పంపిణీ నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే, ఆనందయ్య ద్వారా రహస్యంగా మందు తయారు చేయిస్తున్నారనీ, ఆనందయ్యను వంట మనిషిగా మార్చేశారనీ అధికార పార్టీపై విమర్శలు రావడంతో, అనూహ్యంగా ఆనందయ్యను తిరిగి జనంలోకి తీసుకొచ్చారు. నిన్న సాయంత్రమే తన ఇంటికి చేరుకున్న ఆనందయ్య.. మళ్ళీ ఈరోజు తెల్లారేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులే ఆయన్ని తీసుకెళ్ళారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో ఆనందయ్యకు రక్షణ కల్పించడం అవసరమే కావొచ్చు.

ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలి. ఆనందయ్యకు ఆయన ఇంటి వద్ద భద్రత కల్పిస్తే సరిపోతుంది. అయినా, ఆనందయ్య చుట్టూ ఎందుకింత పబ్లిసిటీ జరుగుతోంది.? సామాన్యులకి అందుబాటులో లేని ఆనందయ్య మందు, రాజకీయ ప్రముఖులకి పలుకుబడి వున్నవారికి ఎలా దక్కుతోంది.? ఏమోగానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నాటు మందు ఇచ్చేవాళ్ళున్నా.. వారెవరికీ లేని ప్రత్యేకత.. అదీ రాజకీయ ప్రత్యేకత ఏదో ఆనందయ్య చుట్టూ వున్నట్లే కనిపిస్తోంది.