Bheemla Nayak Roars : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు సంబంధించి చాలా చాలా స్వల్పమని 2019 ఎన్నికల్లో తేలిపోయింది. అయితే, ఆయన పవర్ పెరిగిందా రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో.? అంటే, అది వేరే చర్చ.
కానీ, పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లానాయక్’ విషయమై వైసీపీ ప్రభుత్వం అంతలా ‘అతి’ చేయడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. థియేటర్లకు వీఆర్వోలను కేటాయించి, పెద్దయెత్తున పోలీసులకు కీలక బాధ్యతలు అప్పగించి.. సినిమా థియేటర్లని ‘ప్రత్యేక ఆంక్షలు అమలవుతున్న ప్రాంతాలు’గా మార్చేయాలనే ‘సలహా’ ఎవరిదోగానీ, ఈ పైత్యం పూర్తిగా బెడిసికొట్టిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
‘మేం, ప్రస్తుతానికి అమల్లో వున్న నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాం..’ అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు తాపీగా. కానీ, ఇవే నిబంధనలు ‘పుష్ప’ సినిమాకిగానీ, ‘అఖండ’ సినిమాకిగానీ, ఇటీవల వచ్చిన ‘ఖిలాడీ’ సినిమాకిగానీ ఎందుకు అమలు కాలేదన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానమే లేదు.
ఆఖరికి ‘డీజే టిల్లు’ సినిమాకి కూడా టిక్కెట్లను అధిక ధరలకే అమ్మారు. అప్పట్లో చూసీ చూడనట్టు వ్యవహరించిన వైసీపీ సర్కారు, ‘భీమ్లానాయక్’ దగ్గరకొచ్చేసరికి అనవసరపు యాగీ చేసిందన్నది నిర్వివాదాంశం. ఇంతా చేసి ఏం సాధించారు.? అభాసుపాలయ్యారు.
రాష్ట్రమంతటా పండగ వాతావరణమే సృష్టించేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సినిమా హిట్టవడంతో వైసీపీ శ్రేణులకు నోట మాట పడిపోయిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.