పెట్రో మంటపై కేసీయార్ ధర్నా చెయ్యరెందుకు.?

వరి పంట విషయమై కేంద్ర ప్రభుత్వానికీ, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ‘రచ్చ’ నడుస్తోంది. బీజేపీ – టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ రైతులకు మద్దతుగా తాము భారీ ఆందోళనలు చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించిన విషయం విదితమే.

రేపే.. అంటే శుక్రవారమే ఈ ధర్నాలు జరగనున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీయార్ ఈ ఆందోళనల్లో పాల్గొనరుగానీ, ఆయన పిలుపునిచ్చారు గనుక.. అధికార పార్టీ నేతలంతా ఈ ధర్నాల్లో కనిపించవచ్చు. అదే జరిగితే, ఇదో పెను సంచలనమే అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో.

అధికారంలో వున్నోళ్ళు ఆందోళనలు చేయడం అనేది చాలా చాలా అరుదైన అంశం. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, ప్రత్యేక హోదా కోసమంటూ ధర్మ పోరాట దీక్షలు… అదీ పదవి పోయే ముందు చేసిన విషయం విదితమే. అప్పట్లో ఈ దీక్షల పట్ల చంద్రబాబు ఆశించిన సానుకూలత రాలేదు.

ఇప్పుడు కేసీయార్ కూడా అదే బాటలో పయనిస్తున్నారనుకోవాలేమో. వరి పంట విషయమై ధర్నాలు సబబే. మరి, పెట్రో మంట సంగతేంటి.? కేంద్రమే పెంచింది.. కేంద్రమే తగ్గించాలంటున్న కేసీయార్, కేంద్రం తగ్గించే దిశగా పోరాటం ఎందుకు చేయడంలేదట.?

నిజానికి, పెట్రో ధరల పెరుగుదల అనేది చాలా సీరియస్ అంశం. అన్ని వస్తువుల ధరలూ పెట్రో ధరలకు లిక్ అయి వుంటాయి. అలాంటప్పుడు, పెట్రో ధరలు అదుపు తప్పితే ఎలా.? కేంద్రం, రాష్ట్రాలకు పెట్రో ధరల ద్వారా వచ్చే పన్నుల నుంచి సరైన వాటా ఇవ్వడంలేదని కేసీయార్ చెబుతున్నారు. మరి అలాంటప్పుడు, కేంద్రాన్ని నిలదీయాలి కదా.? ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేయాలి కదా.?

చెయ్యరు.. ఎందుకంటే, అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలు.. కలిసి కట్టుగానే పెట్రో మంట పుట్టిస్తున్నాయ్.