జనసేనలో మళ్లీ అదే నిస్తేజం.. ఎందుకిలా.?

జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక్కరే స్టార్ హీరో. ఆయన పొలిటికల్ ఈవెంట్ ఏదైనా చేస్తే, పార్టీ శ్రేణుల్లో తాత్కాలికంగా ఊపు వస్తోంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. సినిమానే కాస్త బెటర్. రిలీజయ్యాక ఓ వారం, పది రోజులు ఓ వేవ్ అలా కొనసాగుతుంది. అభిమానుల్లో పవర్ అలా కొనసాగుతుంటుంది. జనసైనికులకే, ఆ పవర్ మరీ తాత్కాలికమైపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత ఓ పెద్ద కార్యక్రమం చేపట్టారు. ఒకే రోజు రాష్ర్టంలోనే రెండు చోట్ల శ్రమదానం చేశారు. ఈ క్రమంలో ఓ రెండు, మూడు రోజులు విపరీతమైన హంగామా నడిచింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది.

నిజానికి, కింది స్థాయిలో కార్యకర్తలు బాగానే పని చేస్తున్నారు. దాదాపుగా నెల రోజుల నుంచి రోడ్ల మీద నిరసనలు తెలియచేస్తున్నారు. తమ శక్తి మేరకు రోడ్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేస్తున్నారు. కానీ, వారికి మీడియాలో తగిన గుర్తింపు దొరకడం లేదు. జనసేన పార్టీకి అదే అతి పెద్ద సమస్య.

పార్టీ అధినేత నిత్యం పార్టీ ముఖ్య నేతలకు అందుబాటులో ఉండాలి. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. సమయానుసారం, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే, పార్టీ నిత్యం జనంలో నానుతుంది. పార్టీ పట్ల జనానికీ గౌరవం పెరుగుతుంది. కానీ, వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, అటు సినిమాలకీ, ఇటు రాజకీయాలకీ సరైన న్యాయం చేయలేకపోతున్నారు.

సినిమాలు పూర్తిగా మానేసి, రాజకీయాల్లో ఉంటానని గతంలో చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి, పార్టీ ఆర్ధిక అవసరాల కోసం సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు. రెండు పడవల మీద ప్రయాణం సజావుగా చేస్తున్నారా.? అంటే అదీ లేదు.

మీడియా నుంచి ఎదురవుతున్న అణచివేత, తిరస్కరణ వంటి వాటిని జనసేన పార్టీ అధిగమించేలా జనసేనాని వ్యూహ రచన చేయకపోతే, భవిష్యత్తు రాజకీయం అంధకారం. జనసైనికుల ఆవేదన, జనసేనానికి ఎప్పుడర్ధమవుతుందో.!