2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయాన్ని తెలుగు రాజకీయ చరిత్ర ఇప్పట్లో మర్చిపోదు. ఎన్నికల్లో గెలవడానికి జగన్ రెడ్డి రచించిన వ్యూహాలకు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కుదేలైపోయారు. అయితే ఆయన వ్యూహాలు రచించి, అధికారంలోకి అయితే వచ్చారు, కానీ ఇప్పుడు పాలనలో మాత్రం జగన్ సరైన వ్యూహాలను రచించలేకపోతున్నారు. ఆయనకు పాలనలో దాదాపు అన్ని అడ్డంకులే. దాదాపు తీసుకున్న ప్రతి నిర్ణయం కోర్ట్ ల చుట్టూ తిరుగుతుంది. అయితే జగన్ కు పాలనలో పరాభవం ఎదురుకావడానికి వైసీపీ నాయకులే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జగన్ వైఫల్యం- వైసీపీ నాయకులే కారణం
ఉడుకు రక్తంలో ఉన్న జగన్ ఎన్నికల్లో మాత్రం ఎవ్వరు సలహాలు తీసుకోకుండా విజయం సాధించింది. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించడానికి మాత్రం అనుభవజ్ఞుల సలహాలు కావాలి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు సలహాలు ఇచ్చే నాయకులు అస్సలు ఎవ్వరు లేరు. మంత్రులుగా ఉన్న నాయకులు కూడా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వెనక ఉన్న లోపాలను గురించి చెప్పడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా సలహాలు ఇచ్చే నాయకులు ఉండేవారు కానీ ఇప్పుడు జగన్ కు మాత్రం ఒక్కరు కూడా సలహాలు ఇచ్చే నాయకులు లేరు. జగన్ తమకు మంత్రి పదవి ఇచ్చాడనే భక్తి భావంతో మంత్రులుగా ఉన్న నాయకులు గుడ్డిగా జగన్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ, జగన్ కు ఇబ్బందులు వచ్చిన తరువాత చూస్తూ కూర్చుంటున్నారు.
సీనియర్స్ కు వైసీపీలో ప్రాధాన్యత లేదా!!
అనుభవరాహిత్యంతో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే జగన్ కు ఇబ్బందులు తెస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. . దీనికి కారణం తమకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడమే. జగన్ యువకులకు ప్రాధాన్యతను ఇస్తూ సీనియర్స్ ను దూరం పెట్టడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటి నుండైనా జగన్ సీనియర్ నాయకులను, సలహాదారులనుఁ జగన్ తన పక్కన ఉంచుకుంటారో లేదో చూడాలి.