వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొని, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ అనుభవజ్ఞుణ్ణి ఓడగొట్టి 2019 ఎన్నికల్లో విజయం సాధించి, సీఎం పదవిని జగన్మోహన్ రెడ్డి అధిరోహించారు. జగన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని సీఎం అయ్యారు కానీ సీఎం అయిన తరువాత మాత్రం ఆయనలో ఉన్న అనుభవ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్ట్ ల దగ్గర చాలా సార్లు ఎదురు దెబ్బలు తిన్నది. ఇప్పుడు తాజాగా స్థానిక ఎన్నికల విషయంలో కూడా జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న వైసీపీ ప్రభుత్వం
తొలి నుంచి జగన్ ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి చిక్కులే ఎదురవుతున్నాయి. కొన్నికేసుల్లో మొట్టికాయలు పడ్డాయి. మరికొన్ని కేసుల్లో ప్రభుత్వంపై అంక్షితలు పడ్డాయి. అయినా జగన్ న్యాయసలహాదారులు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. దాదాపు 70 కేసుల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. అయినా మార్పులేదు. చివరకు పంచాయతీ ఎన్నికలపై మొన్న సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ సయితం ఒకరోజు ఆలస్యమవడానికి పిటీషన్ లో లోపాలేనన్న చర్చ జరుగుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ జగన్ తెగేదాకా లాగారు.
గెలిచినా కూడా తలవంచాల్సిన వైసీపీ
నిజమే 151 సీట్లతో ప్రజాభిప్రాయంతో గెలిచిన జగన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అనేక వ్యవస్థల ద్వారా విపక్షమే అడ్డుకుంటుందన్నది వాస్తవమే అయినా సహనం వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్థంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తాజాతీర్పుతో నీరుగారి పోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సేఫ్ ఎగ్జిట్ కావడమే అన్ని విధాలుగా మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జగన్ రెడ్డి ఇప్పటి నుండైనా తన చుట్టూ ఉన్న సలహాదారులను, న్యాయ సలహాదారులను మార్చుకొని రానున్న రోజుల్లో ముందుకు వెళ్లాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.