జయసుధ అంటే ఏఎన్నార్‌కు ఎందుకంత భ‌యం..!

తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ లెజెండరీ నటులు. తెలుగు సినిమాకు తొలి తరం స్టార్ హీరోలు వీళ్ళు. ఎన్టీఆర్ జానపదాలు, పౌరాణికాలలో తనదైన ముద్ర వేస్తే, ఏఎన్నార్‌ సాంఘిక సినిమాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ముఖ్యం గా విషాద ప్రేమకథలో ఏఎన్నార్‌ ని మించినవాళ్లు లేరు. అలాగే ఆ తరం నటుల్లో డాన్స్ లు బాగా చేసే నటుడు ఏఎన్నార్‌ మాత్రమే.

అప్పట్లో ఏఎన్ఆర్ కు హీరోయిన్ల ముద్దుల హీరో అన్న పేరు ఉండేది. ఎన్టీఆర్ సెట్ లో గంభీరంగా ఉంటే….హీరోయిన్ల విషయంలో ఏఎన్ఆర్ ఎంతో చనువుగా, ఫ్రెండ్లీ గా ఉండేవారట. అందరితో కలిసి మెలిసి సరదాగా చిలిపి పనులు చేస్తూ వారిని ఆట పట్టిస్తూ ఉండే వారట. అందువల్లే హీరోయిన్లు ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ ను ఎక్కువగా ఇష్టపడతారని అప్పట్లో టాక్ ఉండేది.

ఏఎన్ఆర్ తన కెరీర్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. సావిత్రి, జామున, కృష్ణ కుమారి, ఆ తర్వాత జయసుధ – జయప్రద – వాణిశ్రీ – జ‌య‌చిత్ర – సావిత్రి – శ్రీవిద్య ఇలా అప్పటి తరం టాప్ హీరోయిన్లు అందరూ ఏఎన్ఆర్ తో నటించిన వారే.

ఎంత మంది హీరోయిన్స్ తో నటించినా స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ సెట్లో ఉంటే త‌న‌కు ఎందుకో భ‌యం ఉంటుంది అని ఏఎన్నార్ అనేవార‌ట‌. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ న‌టుడు ఒక ఇంటర్వ్యూ లో ముర‌ళీమోహ‌న్ చెప్పారు.

జ‌య‌సుధ గొప్ప న‌ట‌న గురించి ఏఎన్నార్ చెప్పిన మాట‌ల‌ను కూడా ముర‌ళీమోహ‌న్ చెప్పారు. జ‌య‌సుధపై సింగిల్ షాట్స్ తీస్తున్న‌ప్పుడు ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ ఎలా ఇస్తుందో మ‌నం గ‌మ‌నించుకోక‌పోతే… త‌ర్వాత ఇద్ద‌రిపై తీసే కామ‌న్ షాట్స్‌లో మ‌నం ఆమెను మించేలా ఎలా ఉండాలో తెలియ‌క దెబ్బైపోతాం… జ‌య‌సుధ సెట్లో ఉంటే త‌న‌కు కాస్త భ‌యం అని చెప్ప‌డంతో పాటు ప‌రోక్షంగా ఆమె ఎంత గొప్ప న‌టో చెప్పేవార‌ట‌. జ‌య‌సుధ ఏ సీన్లో అయినా అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తుంద‌ని ఏఎన్నార్ చెప్పేవార‌ట‌.