Ganta Resignation : గంటా రాజీనామా ఆమోదం పొందదా.? కారణమేంటి.?

Ganta Resignation : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా వుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా, దాని ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామాస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే.

అద్గదీ అసలు సంగతి. గంటా రాజీనామా గనుక ఆమోదం పొందితే, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెరుగుతుంది. సో, అత్యంత వ్యూహాత్మకంగా గంటా రాజీనామాని అధికార పక్షం తొక్కిపెడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, అది స్పీకర్ పరిధిలోని అంశం. స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటారు.

దురదృష్టమేంటంటే, స్పీకర్ విచక్షణ అనేది అదికార పార్టీ అధిష్టానం ఆదేశాల మీద ఆధారపడి వుండటం. గత కొంతకాలంగా ఈ తరహా వైపరీత్యాన్ని చూస్తూనే వున్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలోనూ, ఆ తర్వాత ఈ చిత్రమైన వైఖరి రాజకీయాల్లో కొత్త కొత్త మార్పులకు కారణమైంది.

తాను రాజీనామా చేసేశానని గంటా చెబుతున్నా, ఆయన రాజీనామాకి ఆమోదం లభించే అవకాశమే లేదన్నది ప్రస్తుతం రాజకీయాల్లో బలంగా వినిపిస్తోన్న వాదన. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ అధినాయకత్వం స్వయంగా సూచిస్తున్నా, గంటా స్పందించకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు గుస్సా అవుతున్నారు.

రాజీనామా చేసేశాననీ, తన వరకూ తాను ఎమ్మెల్యేగా వున్నానని అనుకోవడంలేదనీ గంటా తన సన్నిహితులతో చెబుతున్నారట. సాధారణంగా ఎవరు అధికారంలో వుంటే వారి వెంటే నడిచే గంటా, ఈసారెందుకో.. ఎటూ కాకుండా వుండిపోయారు.