AP Govt Ultimatum : ఉద్యోగులెందుకు ఏపీ ప్రభుత్వం హెచ్చిరకల్ని పట్టించుకోవట్లేదు.?

AP Govt Ultimatum : ఉద్యోగుల జీతాల్ని కొత్త పీఆర్సీ ప్రకారం ప్రాసెస్ చేయాలంటూ పదే పదే ప్రభుత్వం ఆయా విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నా, సంబంధిత శాఖలకు చెందిన ఉద్యోగులు మాత్రం ‘ససెమిరా’ అంటున్నారు. జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరి ఒకటవ తేదీన అందాల్సిన కొత్త జీతాల విషయమై తీవ్ర గందరగోళం నెలకొంది.

‘పాత పద్ధతిలోనే జీతాలు కావాలి..’ అని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం, కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలని చెబుతోంది. ఇరువురూ మెట్టు దిగడంలేదు. ఓ వైపు ప్రభుత్వం చర్చలంటోంది.. ఆ చర్చలకు హాజరయ్యేందుకు సిద్ధమని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. కానీ, ఇక్కడ కండిషన్స్ అప్లయ్.. అదేంటంటే, పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేయించాలని ఉద్యోగులు పట్టుబడుతోంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పద్ధతిలో జీతాల్ని ప్రాసెస్ చేయించి తీరతామని ప్రభుత్వం చెబుతోంది.

జీతాలు రాకపోయినా ఫర్వాలేదు.. అని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయంటేనే, ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ సుస్పష్టం. ప్రభుత్వమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, ఉద్యోగులు జీతాల్ని ప్రాసెస్ చేయకపోవడమంటే.. అంతకన్నా ఘోర తప్పిదం ఇంకేముంటుంది.?

అసలు ప్రభుత్వం ఇంతలా ఉద్యోగుల్ని ఎందుకు ఉపేక్షిస్తోందన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. కాగా, తమతో సంప్రదింపులు జరపకుండా, తమ ఆమోదం లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసేసుకుందన్నది ఉద్యోగ సంఘాల వాదన.

కానీ, ఉద్యోగ సంఘాలు ఒప్పుకున్నాకే, పీఆర్సీ ప్రకటన జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఎవరి గోల వారిదే.. అంతిమంగా రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టేశారు ఉద్యోగులు.. ప్రభుత్వ పెద్దలూ.!