ప్రస్తుతం తెలంగాణాలో అపర రాజకీయ చాణిక్యుడు ఎవరయ్యా అంటే అది కచ్చితంగా సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవాలి. ఎత్తులకు పైఎత్తులు వేయటం, ఎవరిని ఎక్కడ వాడాలో అక్కడే వాడుకోవటం, అవసరం లేదనిపిస్తే చాకచక్యంగా పక్కకు తప్పించటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య, కాకపోతే ఇదే సూత్రాన్ని తన స్నేహితుల దగ్గర కూడా ఉపయోగించటం అనేది కొంచం ఇబ్బంది కలిగించే అంశం. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి నుండి నిజామాబాదుకి చెందిన మండవ వెంకటేశ్వర రావు తో మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి.
కేసీఆర్ టీడీపీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెడుతున్న సమయంలో మండవను పార్టీలోకి రమ్మని కోరటం జరిగింది. అయితే టీడీపీని వదిలి రాలేనని చెప్పాడు మండవ. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. మొన్నటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజామాబాదు నుండి పోటీచేస్తే, ఆమెకు వ్యతిరేకంగా రైతులు నామినేషన్ వేయటంతో కవిత గెలుపు కష్టమేనని కేసీఆర్ భావించాడు. ఆ వ్యతిరేకతను తగ్గించి ఎన్నికల్లో కవితను గెలిపించటానికి మండవ సహకారం కేసీఆర్ కోరాడు. స్వయంగా కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని కోరటం జరిగింది. ఎందుకంటే మండవ వెంకటేశ్వర రావుకి క్లిన్ ఇమేజ్ వుంది. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే కవిత గెలుపుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ భావించాడు. ఇక అప్పటికే టీడీపీ పార్టీ తెలంగాణలో పట్టు కోల్పోవటంతో మండవ కూడా తన మిత్రుడు కేసీఆర్ మాటకు సరేనని కారెక్కాడు. ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి కేసీఆర్ దగ్గర సృష్టమైన హామీ తీసుకున్నాడు.
ఆ ఎన్నికల్లో కవిత ఘోరమైన ఓటమి చవిచూసింది. దీనితో మండవ కూడా కేసీఆర్ ని ఏమి అడగలేని స్థితిలో ఆగిపోయాడు. అది జరిగి ఏడాదిన్నర కావస్తున్నా కానీ, కేసీఆర్ మాత్రం మండవ రాజకీయ భవిష్యత్తుపై ఏమి మాట్లాడటం లేదు. తనతో పాటు తెరాస లోకి వచ్చిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కి ఏకంగా రాజ్యసభ సీటు అప్పగించారు, మండవకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వకపోగా, కేసీఆర్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మండవ అనుచరవర్గం బాధపడిపోతుంది. రాజ్యసభ సభ్యుడైన డీఎస్ శ్రీనివాస్ పదవికి రాజీనామా చేస్తే, ఆ స్థానంలో మండవకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన మొదటిలో కేసీఆర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే డీఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న కానీ, రాజ్యసభకు మాత్రం రాజీనామా చేయలేదు. ఈ సాకుతో కేసీఆర్ మండవని పట్టించుకోవటం మానేశాడు . దీనితో మండవ కూడా తెరాస పార్టీకి దూరంగా ఉంటున్నాడు. అన్ని కుదిరితే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో మండవ వెంకటేశ్వర రావు ఉన్నట్లు తెలుస్తుంది.