సీఎం జగన్ వాళ్ళనెందుకు అదుపు చేయట్లేదు.?

తన మీద ప్రతిపక్ష నేతలు దూషణలకు దిగినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడినప్పుడు, ‘నన్ను అభిమానించేవారికి ఆగ్రహం వచ్చింది.. బీపీ పెరిగింది..’ అంటూ వ్యాఖ్యానించారు. మరి, అదే బీపీ.. ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలకు కూడా వుంటుందన్న కనీస విజ్ఞతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్మరించారెందుకు.?

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కావొచ్చు. దూషణలు కూడా కొంతవరకు సహజమే కావొచ్చు. మరీ, జుగుప్సాకరమైన రీతిలో దూషణలకు దిగడం ఎవరికీ మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు.. వ్యవస్థలకు సంబంధించిన అంశం. ప్రజలకు సంబంధించిన అంశం.

ముఖ్యమంత్రి హోదాలో.. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా, రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా, ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే వుంటుంది. అలాంటిది అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు, ప్రతిపక్ష నేత మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తే, కనీసం, ‘ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను..’ అని కూడా వైఎస్ జగన్ ఎందుకు అనలేకపోయారు.?

గతంలో టీడీపీ అలా వ్యవహరించింది కాబట్టి, ఇప్పుడు వైసీపీ అలా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీని సమర్థించుకోకూడదు. కానీ, సమర్థించుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరం.

వైఎస్ జగన్ అలా ఉపేక్షిస్తుండడం వల్లే వైసీపీ నేతలు అంతలా రెచ్చిపోతున్నారన్నది నిర్వివాదాంశం. అయితే, వైఎస్ జగన్ మీద టీడీపీ కూడా దూషణలకు దిగుతోంది కాబట్టి ‘చెల్లుకు చెల్లు’ అన్న ధోరణిలో వైసీపీ అధినాయకత్వం వున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు. వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ వ్యవహరించే వ్యవహార శైలికి, ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించాల్సిన శైలికీ తేడా వుంటుంది.. వుండాలి కూడా.