టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరులో టీడీపీ నాయకులు చేసిన హడావిడిని ఎవ్వరూ మర్చిపోలేరు. జిల్లా పార్టీ ఆఫీస్ ఎప్పుడూ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కళకళలాడుతూ ఉండేది. అలాంటి పార్టీ ఆఫీస్ ఇప్పుడు వెలవెలబోతోంది. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతోంది. స్థానిక ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీపై టీడీపీ ఖచ్చితంగా పై చేయి సాధిస్తుందనే చాలా మంది అంచనా వేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఇప్పుడు గుంటూరును పట్టించుకోవడం మానేశారు.
గుంటూరును పట్టించుకోవడం లేదా!!
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు నిత్యం గుంటూరు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం గుంటూరును పట్టించుకోవడం లేదు. నాడు ఎమ్మెల్యేగాను, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జివి. ఆంజనేయులు ప్రెస్‌మీట్లతో హడావిడి చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అలాగే యరపతినేని కూడా ఇప్పుడు గుంటూరుకు దూరంగా ఉంటూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మాత్రం పిడుగురాళ్లలో మకాం వేసి పట్టు కోసం పాకులాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఇలా టీడీపీ నాయకులు ఇప్పుడు గుంటూరును పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ వాళ్లకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి.
కార్యకర్తల్లో కూడా విముఖత ఉందా!!
సత్తెనపల్లిలో పార్టీకి కెప్టెన్ లేక కేడర్ డీలా పడింది.మాజీ ఎంపీ రాయపాటి ఫ్యామిలీ వరుస కేసులతో రాజకీయాలకు దూరంగా ఉంది. ఉన్నంతలో పాత నేతల్లో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు మాత్రమే గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఇక కొత్త నేతల్లో నరసారావుపేట ఇన్‌చార్జ్ చదలవాడ అరవిందబాబు, బాపట్ల ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఇద్దరు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఈ నాయకులు టీడీపీని గుంటూర్ లో ఎంత వరకు నడిపిస్తారో వేచి చూడాలి.