Chandrababu : చంద్రబాబూ.. ఏదీ ఆ విశ్వసనీయత.?

Chandrababu : ఎక్కడన్నా చీమ చిటుక్కుమంటే చాలు, అధికార వైసీపీ మీద విరుచుకుపడిపోతుంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. తమ పార్టీకే చెందిన ఓ నేత, ఓ అమ్మాయిని లైంగికంగా వేధిస్తే.. ఆ వేధింపులు తాళలేక ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడితే, ఈ ఘటనపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదు.?

పార్టీ పరంగా సదరు నేత వినోద్ జైన్‌ని సస్పెండ్ చేయడంతో టీడీపీ చేతులు దులిపేసుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘ఇకపై ఇలాంటివారికి పార్టీలో ఆస్కారం వుండదు..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించి వుంటే, అది ఎంత హుందాగా వుండేది.? ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏనాడో హుందాతనం మర్చిపోయారు. ఆయన్నుంచి హుందాతనం ఆశించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

అన్నట్టు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై మౌనం దాల్చడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ మహిళా విభాగం, ‘నారీ దీక్ష’ అనే పేరుతో పార్టీ పరమైన కార్యక్రమానికి పిలుపునిచ్చుకుని, అదే వేదికపైనుంచి వైఎస్ జగన్ సర్కారుపై విరుచుకుపడిపోయింది.

నిజానికి, ఘాతుకానికి పాల్పడింది తమ పార్టీ నాయకుడే కాబట్టి, టీడీపీ మహిళా విభాగం.. ‘నారీ దీక్ష’ని పక్కన పెట్టి వుండాల్సింది. తమ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకి గురైన మానవ మృగం వినోద్ జైన్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి వుండాల్సింది.

ఏంటో టీడీపీ రాజకీయం.? ఇలాంటి చర్యలతో మరింతగా దిగజారిపోతోంది టీడీపీ పరిస్థితి.