హైదరాబాద్ లో పోలీసులు పట్టుకున్న నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్. తనకు సంబంధం లేని ఒక వ్యాపార లావాదేవీలోకి తనను లాగడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన పేరును ప్రస్తావించడం సరికాదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తప్పుపడుతూ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. పోలీసులపై అధికార టీఆర్ఎస్ పెత్తనం పెరిగిపోయిందని అందుకే పోలీసులు కూడా వ్యక్తిగతంగా కొంత మందిని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని వివేక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను గ్రహించే కేసీఆర్ పోలీసులను రంగంలోకి దించారని ఆరోపించారు. అందుకే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తనపై వ్యక్తిగతంగా కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి మరీ … వారి ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. ఈ మేరకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.
నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులను అధికార పార్టీ తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోంది వివేక్ ఆరోపించారు. దుబ్బాకలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ తో పాటు ప్రగతి భవన్ లో పోలీసులు సోదాలు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇక్కడి నుంచే దుబ్బాకకు భారీగా డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ లో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులో ఇద్దర్ని అరెస్టు చేసినట్లు ఈపాటికే హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వారి వద్ద లభించిన కీలక సమాచారం ఆధారంగానే నగదు విశాఖ ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు తీసుకెళుతున్నారని దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో పనిచేస్తారని వెల్లడించారు సీపీ అంజనీకుమార్.