తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నందమూరి బాలకృష్ణ కూడా ఓ అగ్ర నటుడు. ఓ పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన సూపర్ స్టార్. తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి నట వారసత్వాన్ని అయితే పూర్తి స్థాయిలో స్వీకరించి, న్యాయం చేయగలిగారుగానీ.. రాజకీయ వారసత్వం విషయంలోనే బాలయ్య తన స్థాయికి తగ్గ రీతిలో వ్యవహరించడంలేదన్న విమర్శలున్నాయి.
నిజానికి, తెలుగుదేశం పార్టీకి బాలయ్యే పెద్ద దిక్కుగా వుండాలి ప్రస్తుత పరిస్థితుల్లో. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, గత కొంతకాలంగా పార్టీని భ్రష్టుపట్టించేశారన్న విమర్శలున్నాయి. ఎన్టీయార్ హయాంలో టీడీపీ ఏంటి.? చంద్రబాబు హయాంలో టీడీపీ ఏంటి.? వాస్తవానికి నందమూరి బాలకృష్ణ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఎన్నికల సమయంలో కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. అయితే, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా బాలయ్యకు మంత్రి పదవి దక్కేలేదు. అప్పట్లో నారాయణ, లోకేష్ లాంటివారికి మంత్రి పదవులు వచ్చాయిగానీ, బాలయ్యకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
టీడీపీ కార్యకర్తల్లో మెజార్టీ ఓటు నందమూరి బాలయ్యకే.. పార్టీ బాధ్యతలకు సంబంధించి. కానీ, బాలయ్యకు ఆ అవకాశమే దక్కడంలేదు. బహుశా బాలయ్య తన సినిమా కెరీర్ రాజకీయాల వల్ల దెబ్బతినకూడదనే మిన్నకుండిపోతున్నారేమోనన్న వాదన కూడా లేకపోలేదు. కానీ, ఎన్టీయార్.. అంటే ఓ ప్రభంజనం. దేనికీ భయపడే వ్యక్తి కాదు ఆయన. మరి, అలాంటి ఎన్టీయార్ వారసుడిగా బాలయ్య, రాజకీయాల్లో ఎందుకు చక్రం తిప్పకూడదు.? టీడీపీ పగ్గాలు ఎందుకు చేపట్టకూడదు.? బాలయ్య బాధ్యతలు తీసుకుంటేనే తెలుగుదేశం పార్టీ బాగుపడుతుందని కార్యకర్తలు కుండబద్దలుగొట్టేస్తున్నా, బాలయ్య మాత్రం ‘అంతా బావ చంద్రబాబే చూసుకుంటారు.. అల్లుడు లోకేష్ వుండగా నేనెందుకు.?’ అన్నట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.