అక్కడే జంతువుల్ని వధిస్తారు.. అక్కడే మటన్ విక్రయిస్తారు.. అత్యాధునికమైన పద్ధతిలో మటన్ మార్టుల్ని ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోందంటూ కొద్ది రోజుల క్రితమే ఓ కథనం వచ్చింది. మొబైల్ వాహనాల ద్వారా వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆ విషయాన్నే, వైసీపీ అనుకూల మీడియా కథనాల రూపంలో తెరపైకి తెచ్చింది. ఇంతలోనే ఏమయ్యిందోగానీ, మటన్ మార్టుల ప్రతిపాదన లేదని మంత్రి అప్పలరాజు తేల్చి చెప్పేశారు. అది శాఖాపరమైన పరిశీలన అన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇచ్చిన వివరణతో వైసీపీ వర్గాలే షాక్ అయ్యాయి. ఎందుకంటే, వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మటన్ మార్టుల్ని తీసుకురాబోతోందంటూ గొప్పగా ప్రచారం చేసేసింది వాళ్ళే మరి.
‘జగనన్న మటన్ మార్టులు..’ అంటూ వాటికి పేరు కూడా పెట్టేసుకున్నారు వైసీపీ మద్దతుదారులు. దీన్ని కూడా ఓ సంక్షేమ పథకంలానే ప్రచారం చేశారు. అంతేనా, బోల్డంతమందికి ఉపాధి దొరుకుతుందని కూడా భావించారు. మటన్ దుకాణాల్లో ఉపాధి ఏంటి చెప్మా.? అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ మొత్తం వ్యవహారంపై పెద్దయెత్తున దుమారం చెలరేగేసరికి, ప్రభుత్వం డ్యామేజీ కంట్రోల్ చర్యలకు దిగిందని అనుకోవాలేమో. నిజమే, ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. అధికార పార్టీ అనుకూల మీడియాలో వచ్చిన కథనం.. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేలా వుందంటే.. వైసీపీ అధిష్టానం ఈ వ్యవహారంపై ఒకింత లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా వుందన్నమాట. కాగా, ప్రభుత్వం మంచి ఆలోచనే చేసిందనీ, అయితే అది ఇంకోలా కన్వే అయ్యేసరికి.. వేరే దారి లేక, మంత్రి ద్వారా ‘ఆ ప్రతిపాదన లేదు’ అని మటన్ మార్టులపై ప్రకటన చేయాల్సి వచ్చిందనేది ఇంకో వాదన.