రాష్ట్రం కేంద్రాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది.?

Why AP Is Failed In Polavaram Project?

Why AP Is Failed In Polavaram Project?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా వున్నారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశమై, పోలవరం ప్రాజెక్టు విషయమై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విడుదల జరగాల్సి వుందనీ, రాష్ట్రం సొంత నిధుల్ని వెచ్చించి ప్రాజెక్టుని నిర్మించడం కష్టంగా మారుతోందనీ, అయినా తాము కష్టపడుతున్నామనీ, ఆ నిధుల్ని రీ-ఎంబర్స్ చేయాలనీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎందుకీ దుస్థితి ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కలిగింది.? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.

పోలవరం, జాతీయ ప్రాజెక్టు గనుక కేంద్రమే అవసరమైన మేర నిధుల్ని విడుదల చేయాల్సి వుంటుంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందక ముందు రాష్ట్రమే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గనుక, రాష్ట్రమే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించాలనీ, కేంద్రం అవసరమైన మేర నిథుల్ని విడుదల చేస్తుందనేది.. రాష్ట్రం అలాగే కేంద్రం మధ్య గతంలో కుదిరిన ఒప్పందం సారాంశం. అలాంటప్పుడు, ఎందుకు కేంద్రం దగ్గర నిథుల కోసం రాష్ట్రం ప్రతిసారీ దేబిరించాల్సి వస్తోంది.? చంద్రబాబు హయాంలో కూడా ఇదే జరిగింది. వైఎస్ జగన్ హయాంలో కూడా అదే జరుగుతోంది.

జాతీయ ప్రాజెక్టుకి అవసరమైన పూర్తి నిథులు కేంద్రమే కేటాయించాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రాజెక్టు పూర్తి చేయడమంటే, ఏవో కుంటి సాకులు చెప్పి.. నిర్మాణ వ్యయం తగ్గించేసి చేతులు దులిపేసుకోవడం కాదన్న విషయం కేంద్రానికి ఎప్పుడు అర్థమవుతుంది.? నిజానికి రాష్ట్రం నుంచి బలమైన గొంతుక అనేది కనిపించడంలేదు, కేంద్రాన్ని నిలదీసే విషయంలో. ఎవరు అధికారంలో వున్నా అదే పద్ధతి అయితే ఎలా.? రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం కేంద్రానికి కలిసొస్తోంది. ‘మేం భరించలేం.. త్వరగా పూర్తి చేసే బాధ్యత మీరే తీసుకోండి..’ అని కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు బాధ్యతని వదిలేసి, వేగంగా పూర్తి చేసేదాకా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉద్యమిస్తే కాస్తో కూస్తో ఫలితం దక్కుతుందేమో.

కానీ, ప్రాజెక్టు క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ ఆరాటపడుతుండడంతో.. రాష్ట్రం ఈ ప్రాజెక్టుని కేంద్రానికి అప్పగించేసే ప్రసక్తే లేదు. అసలు వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? బీజేపీ అలా ఆ ప్రాజెక్టుని పూర్తి కానిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడ.