గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వం నిర్ణయాల మూలంగా సినీ ఇండస్ట్రీ ఇన్ని తిప్పలు పడిన సందర్భం లేనేలేదు. ఇంకా గత ప్రభుత్వాలు పరిశ్రమకు అడపాదడపా సహకారం అందించేవి. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మూలాన థియేటర్ వ్యవస్థే స్తంభించిపోయింది. సినిమా వాళ్ళు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచేసి జనాన్ని దోచుకుంటున్నారు అంటూ వకీల్ సాబ్ సినిమాకు టికెట్ ధరలను భారీగా కుదించింది జగన్ సర్కార్. పనిగట్టుకునిఅర్థరాత్రి జీవో వదిలారు. దీంతో సినిమా హాళ్లు కొన్ని లాక్ డౌన్ కంటే ముందే మూతబడ్డాయి. లాక్ డౌన్ సడలింపు వచ్చినా ఇంకా థియేటర్లు ఓపెన్ కాలేదు అంటే కారణం ప్రభుత్వమే.
తగ్గిన టికెట్ ధరలతో థియేటర్లు నడపడం కష్టమవుతోంది. అందుకే ఈ క్లోజింగ్. దీని కారణంగా హీరోలు, దర్శకులు, నిర్మాతల పరిస్థితి ఎలా ఉన్నా థియేటర్ రంగాన్ని నమ్ముకుని దశాబ్దాల తరబడి జీవిస్తున్న వేల మంది జీవితాలు అయోమయంలో పడిపోయాయి. టికెట్ రేట్లను సవరిస్తే బాగుంటుందని నిర్మాతల మండలి ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడ చేసింది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. వేల కోట్ల టర్నోవర్, వేల మంది జీవుతాలు ఉన్న సినిమా పరిశ్రమ గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వానికి లేదు అంటే ఏమనాలి. నిజానికి టికెట్ ధరలను సవరించమనడం సమంజసమే. కానీ సర్కార్ స్పందించట్లేదు. కనీసం సినిమా పెద్దలకు కలిసే అవకాశం ఇస్తున్నట్టు కూడ కనిపించట్లేదు. దీని మూలంగా తెలంగాణలో థియేటర్ రంగం కూడ కోలుకోలేని దెబ్బతింటోంది.