ఎన్టీయార్ అభిమానుల్ని కెలికిన మంత్రి అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబుకి తన శాఖా వ్యవహారాల కంటే, ఇతర వ్యవహారాల మీద ఎక్కువ మోజు వున్నట్టుంది. పోలవరం ప్రాజెక్టు సంగతి ఏంటి.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘మీది ఏ మీడియా.? ఈనాడు అయితే ఒక సమాధానం.. ఆంధ్రజ్యోతి అయితే ఇంకో సమాధానం..’ అంటూ మీడియా మధ్య విభజన తీసుకురావడం తప్ప, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు గురించి మాత్రం స్పష్టతనివ్వరాయన.

తాజాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా విమర్శలు చేసే క్రమంలో ‘జూనియర్ ఎన్టీయారో.. బోనియర్ ఎన్టీయారో..’ అంటూ నోరు జారేశారు మంత్రి అంబటి రాంబాబు. అంతే, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులకు ఒళ్ళు మండిపోయింది.

ఏకంగా, ‘అంబటి రాంబాబు మృతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి..’ అంటూ సోషల్ మీడియాలో అంబటి ఫొటోలకు దండలు వేసేసి, ‘రెస్ట్ ఇన్ పీస్..’ అనేస్తున్నారు. అంతేనా, ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ ఎన్టీయార్‌కి క్షమాపణ చెప్పాలి..’ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చశారు యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు.

చూస్తోంటే, మంత్రి అంబటి ఒక్కడు చాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నట్టేట్లో ముంచెయ్యడానికన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. ఔను మరి, పార్టీకి మంచి చేయకపోయినా ఫర్లేదు, చేటు జరిగేలా మంత్రి అంబటి వ్యవహార శైలి గత కొద్ది కాలంగా. మంత్రి అయ్యానన్న అత్యుత్సాహమో, లేదంటే ఇంకేదన్నా కారణమోగానీ.. అంబటి మాత్రం వైసీపీని నిండా ముంచేస్తున్నారన్నది నిర్వివాదాంశం.

ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే.