Ali And Posani : అలీ, పోసాని ఎందుకు వెళ్ళారు.? ఏం సాధించారు.?

Ali And Posani : సీనియర్ నటులు అలీ, దర్శకుడు అలాగే నిర్మాత, రచయిత, నటుడు కూడా అయిన పోసాని కృష్ణమురళి నిన్న సినీ పరిశ్రమ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి తదితరులకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.. వీరితోపాటే అలీ, పోసాని అలాగే ఆర్ నారాయణమూర్తి కూడా చర్చల్లో కనిపించారు.

అలీ సీనియర్ నటుడు, పోసాని కేవలం నటుడే కాదు, నిర్మాత, దర్శకుడు, రచయిత కూడా. ఆర్ నారాయణమూర్తి సంగతి సరే సరి. ఈ ముగ్గురిలో అలీ నేరుగా వైసీపీతో సంబంధాలు కలిగి వున్నాడు. పోసాని కూడా అంతే. ఆర్ నారాయణమూర్తి మాత్రం వైసీపీ సానుభూతిపరుడేగానీ, వైసీపీ కండువా ఏనాడూ భుజాన వేసుకోలేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు 2019 ఎన్నికల్లో అలీని వైసీపీ ఓ అస్త్రంగా ప్రయోగించిన మాట వాస్తవం. ఆయనకు ఆ తర్వాత మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఎమ్మెల్సీ కోటాలో అలీకి ఆ అవకాశం దక్కబోతోందనే ప్రచారం జరిగింది. కానీ, అలీ ఎలాంటి పదవీ పొందలేకపోయారు ఇప్పటిదాకా వైసీపీ హయాంలో.

ఇదిలా వుంటే, అలీ రాజ్యసభకు వెళ్ళే అవకాశం వుందనే ప్రచారం తెరపైకొచ్చింది. మరి, పోసాని మాటేమిటి.? అంటే, ఆయనకు సినీ పరిశ్రమ తరఫున వైసీపీ ప్రభుత్వంలో ఓ కీలక పదవిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టబెట్టబోతున్నారట. ఆర్ నారాయణమూర్తికి కూడా వైఎస్ జగన్ సముచిత గౌరవం ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

సరే, పార్టీ పరంగా.. ప్రభుత్వం పరంగా అలీ, పోసాని, నారాయణమూర్తి తదితరులకు పదవులు ఇచ్చుకోవడమనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టం. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై కీలక సమావేశానికి ఆహ్వానించదగ్గ ప్రముఖులు ఇంకా చాలామందే వుండగా, ఈ ముగ్గురినీ ఎందుకు ప్రత్యేకంగా ఆహ్వానించి వుంటారన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు.