ప్రస్తుతం తెలంగాణ మొత్తం దుబ్బాక ఉపఎన్నికతో బిజీ అయిపోయింది. మంగళవారం నాడు దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉండగా… ఈ ఎన్నిక ఫలితాలు నవంబర్ 10న రానున్నాయి.
సరే.. అసలు విషయానికి వస్తే.. దుబ్బాక బరిలో ఉన్నది 23 మంది. గెలుపు కూడా ఎవరిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసవరం లేదు. అయితే.. దుబ్బాక ఉపఎన్నిక జరిగేది ఎందుకంటే.. రెండో స్థానం కోసమే. అవును.. ప్రస్తుతం అదే పెద్ద సస్పెన్స్. రెండోస్థానంలో ఏ పార్టీ నిలుస్తుంది. అది కాంగ్రెస్సా? లేక బీజేపీనా?
23 మంది అభ్యర్థులు ఉన్నా… పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల నుంచే. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ పార్టీల అభ్యర్థులదే అసలు పోటీ. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే.. అధికార పార్టీతో నువ్వా నేనా అన్నంత రేంజ్ లో పోటీ పడింది మాత్రం బీజేపీ పార్టీయే. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎంత రచ్చ జరిగిందో తెలుసు. ఎన్నికల రేపు అనగా కూడా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.
అంటే.. ఇక్కడ సగటు తెలంగాణ పౌరుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. రెండోస్థానం కోసం విపరీతంగా పోటీ పడుతోంది బీజేపీయే అని. ఇంకో విషయం ఏంటంటే.. రాబోయే ఎన్నికల్లో అంటే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది అంటే… ఇప్పుడు రెండో స్థానంలో నిలిచే పార్టీనే. దుబ్బాక ఉపఎన్నిక అంత హీట్ ఎక్కడానికి కారణం కూడా అదే. ఇక్కడ రెండో స్థానంలో ఏ పార్టీ నిలిచి.. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ.. టీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇవ్వబోతుందని గ్రహించాలి. అందుకే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమీ తూమీ తేల్చుకుంటున్నాయి.
2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇంత రచ్చ జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఇన్ని గొడవలు జరగలేదు. కానీ.. ఒకేఒక్క స్థానం కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ కొట్టుకున్నాయి.