బీఆర్ఎస్: ఆ ముగ్గురిలో తెలంగాణ ఎవరికి.?

ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లుంది పరిస్థితి. అప్పుడే భారత్ రాష్ట్ర సమితిలో.. అదేనండీ, తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారింది కదా.. ఆ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ బాధ్యతలు ఎవరివి.? అన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీలో ‘కాక’ రేపుతున్నాయ్.

ఇంకెవరికి.? కేసీయార్ రాజకీయ వారసుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకే ఆ పగ్గాలు దక్కుతాయన్నది బహిరంగ రహస్యం. అలా ఎలా కుదురుతుంది.? కేటీయార్ కంటే ముందు నుంచీ హరీష్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితిలో, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వున్నారన్నది హరీష్ వర్గం వాదనగా కనిపిస్తోంది.

నాన్సెన్స్, ‘తెలంగాణ జాగృతి’ ద్వారా బతుకమ్మ వేడుకలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి కవిత వెన్నుదన్నుగా వున్నారనీ, మహిళా చైతన్యంతోనే తెలంగాణ సాధ్యమయ్యిందనీ, మహిళకే పార్టీ పగ్గాలు అప్పగించాలనీ ఇంకో వర్గం తమ వాదనను వినిపిస్తోంది.

సరిపోయింది సంబరం.. భారత్ రాష్ట్ర సమితి పేరుని కేంద్ర ఎన్నికల సంఘం ధృవీకరించాలి.. అది జాతీయ పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టతనివ్వాలి.. ఆ తర్వాత కదా, తెలంగాణ బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి.? అన్న చర్చ తెరపైకొస్తుంది.!

కానీ, ఈలోగానే రచ్చ షురూ అయ్యింది. అసలే తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి అంతంతమాత్రంగా తయారైందిప్పుడు. మొన్న దుబ్బాక, ఆపై హుజూరాబాద్.. రేప్పొద్దున్న మునుగోడులో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మునిగితేనో.?