సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే విక్రయిస్తే.. నష్టమెవరికి.?

Govt Sell Cinema Tickets

Govt Sell Cinema Tickets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, ఓ వెబ్ సైట్ రూపొందించి, దాని ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించాలనుకుంటోంది. ఈ మేరకు వెబ్ సైట్ రూపకల్పన కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి ఓ దర్శకుడు మినహా ఇంకెవరూ ప్రస్తుతానికి ఈ అంశంపై స్పందించలేదు. సినిమా పెద్దలైతే పూర్తిగా మౌనం దాల్చుతున్నారు ప్రభుత్వమే టిక్కెట్లు విక్రయించడానికి సంబంధించి.

ఇంతకీ ఏది రైటు.? ఏది రాంగు.? ప్రభుత్వమే వెబ్ సైట్ పెట్టి టిక్కెట్లను విక్రయించడం ద్వారా, ప్రభుత్వం చెప్పిన ధరలకు మాత్రమే సినిమా టిక్కెట్లను అమ్మడానికి వీలుంటుంది. బ్లాక్ మార్కెటింగ్ పూర్తిగా ఆగిపోతుందన్నది కొందరి వాదన. అందులోనూ నిజం లేకపోలేదు. కానీ, రాష్ట్రంలో ఇసుక విక్రయాల విషయంలో ఏం జరుగుతోంది.? అత్యంత దారుణంగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. అసలు ధరకు పదింతల ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది ఇసుక అవసరమైనవాళ్ళు. సినిమా టిక్కెట్ల విషయంలో ఈ పరిస్థితి తలెత్తితే.? అది ప్రభుత్వానికే చెడ్డపేరు.

వాస్తవానికి ఈ అంశంలోకి ప్రభుత్వం తొంగిచూడకపోతేనే మంచిదేమోనన్నది చాలా అభిప్రాయం. తొంగిచూడటమేంటి.? పూర్తిగా వేలు పెట్టేసి, పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకుంటేనూ.? త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిథుల బృందం ఈ అంశంపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిందనీ, పూర్తి వివరాలతో కూడిన నివేదికను జగన్ సర్కారుకి అందించనుందనీ తెలుస్తోంది. పరిశ్రమ ఈ విషయంలో వ్యతిరేక అభిప్రాయాన్నే వ్యక్తం చేయొచ్చని సమాచారం.