తిరుపతి ఉప ఎన్నిక సహా, రాష్ట్రంలో ఇటీవలి నివర్ తుపాను వల్ల కలిగిన నష్టం, రాష్ట్ర రాజకీయాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్రం, రైతుల కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బరిలో వుంటారనీ, ఆ అభ్యర్థి ఏ పార్టీకి చెందినవారు.? అన్నది ముందు ముందు తేలుతుందనీ అన్నారు.
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించీ మాట్లాడారు. అన్నిటికీ మించి, మెగాస్టార్ చిరంజీవి గురించీ, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ గురించీ ప్రస్తావించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలపాటు హైద్రాబాద్‌కే పరిమితమైపోయిన పవన్ కళ్యాణ్, జనసేన నేతల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తోన్న విషయం విదితమే.
ప్రజారాజ్యం – చిరంజీవి – ఎక్కడ తప్పు జరిగింది.?
ఆ రోజు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, బోల్డంతమంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. అయితే, అభిమానం వేరు.. రాజకీయాలు వేరని అర్థం చేసుకోవడానికి చిరంజీవికి పెద్దగా సమయం పట్టలేదు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే, పాలకొల్లులో ఓడి, తిరుపతి నుంచి గెలిచారు చిరంజీవి. మరోపక్క, ప్రజారాజ్యం పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లను సాధించుకుంది. లోక్‌సభ సీట్లు గెలవలేకపోయినా.. అసెంబ్లీ సీట్ల పరంగా గౌరవ ప్రదమైన స్కోరే సాధించింది. కానీ, ఎక్కువ కాలం ప్రజారాజ్యం పార్టీ మనుగడ సాధించలేకపోయింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైపోయింది. ఇది జరిగిన కథ. ఆనాటి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ‘చిరంజీవి లాంటి బలమైన నాయకుడ్ని మనం నిలబెట్టుకోలేకపోయాం..’ అని పవన్ వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికపై అదే గందరగోళం
ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్‌కి ఏం చెప్పారోగానీ, తిరుపతి ఉప ఎన్నిక విషయమై జనసేనానిలో కూడా గందరగోళం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లెన్ని.? బీజేపీకి వచ్చిన ఓట్లెన్ని.? అన్న గణాంకాలు తీస్తే, ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ నుంచి నిలబడాలన్నదానిపై స్పష్టత వచ్చేస్తుంది. కానీ, తిరుపతి ఉప ఎన్నిక విషయమై బీజేపీ చాలా ఉత్సాహంగా వుంది. తమ గురించి తాము ఎక్కువ ఊహించుకుంటోన్న బీజేపీ, మిత్రపక్షం జనసేనను కూడా లెక్క చేసే పరిస్థితుల్లో కనిపించడంలేదు. కానీ, జనసేనాని మాత్రం తమ పార్టీ తరఫున ముగ్గురు వ్యక్తులు పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నారంటున్నారు. అదే నిజమైతే, అభ్యర్థిని చూచాయిగా ప్రకటించేసి.. గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేసి వుండాల్సింది.
రైతుల సమస్యలపై రెండు నాల్కల ధోరణి..
కేంద్రం రైతుల్ని ఉద్ధరించేస్తోందన్నది జనసేనాని వాదన. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడంలేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. తప్పదు, బీజేపీతో జనసేనాని కలిసి నడుస్తున్నారు కాబట్టి, కేంద్రం నిర్ణయాల్ని సమర్థించాలి. రాష్ట్రంలో విపక్షం గనుక, జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి. అదే జరుగుతోంది. రైతులు దేశవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి విషయంలో ఏ పార్టీది అయినా ఒకే వాదన వుండాలి. వేలాది మంది రైతులు, రాజధానిలో పోరాటం చేస్తోంటే, ‘కేంద్రాన్ని’ పొగడాల్సిన అవసరమేంటో జనసేనానికే తెలియాలి.