వంగవీటి రాధా.. ప్రస్తుతం ఈయన ఎక్కడున్నారో తెలియదు. పేరుకు టీడీపీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఈయన్ను పట్టించుకోవడం లేదు. ఈయన టీడీపీని పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో చూశాం ఆయన్ను. అమరావతి రైతుల తరుపున మాట్లాడుతుండగా.. మళ్లీ కన్పించలేదు. రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా.. ఆయన జాడ మాత్రం లేదు.
ప్రస్తుతానికి తన నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటేనే రాధా బయటికి వస్తున్నారు. లేదంటే గప్ చుప్. నిజానికి ఆయన రాష్ట్రస్థాయి నేతగా ఎదగొచ్చు. కేవలం నియోజకవర్గానికే పరిమితం కావాల్సిన నేత కూడా కాదు. ఆయనకు బయట అంత ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ.. రాధా మాత్రం ఎందుకో తన నియోజకవర్గాన్ని దాటి బయటికి రాలేకపోతున్నారు.
2019 ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న వంగవీటి… సరిగ్గా ఎన్నికల సమయానికి టీడీపీలో చేరారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయకున్నా.. జస్ట్.. పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచారం చేశారు. కానీ.. గత ఎన్నికల్లో టీడీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అందరికీ తెలుసు. దీంతో అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలను దూరం పెడుతున్నారు.
వంగవీటి రంగా వారసుడిగా… రాజకీయాల్లో ఎదగడానికి రాధాకు ఎంతో స్కోప్ ఉంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఆయనకు ఉంది. కానీ.. ఎందుకో వంగవీటి రాధా.. తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదేమో.. అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వంగవీటిని మళ్లీ చూడాలంటే.. కేవలం ఎన్నికల ముందేనని.. ఎన్నికలు వస్తేనే రాధా బయటికి వస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి.. ఆయన ఎప్పుడు బయటికి వస్తారో? ప్రజాక్షేత్రంలో ఎప్పుడు తిరుగుతారో?