టీడీపీ నేత పట్టాభి ఎక్కడ.? గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రశ్న ఇది. టీడీపీ శ్రేణులు ధీమాగానే వున్నాయి. పోలీసులే, ఆయన కోసం గాలిస్తున్నారట. ఇటీవల ముఖ్యమంత్రిపై దూషణల నేపథ్యంలో పట్టాభిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విదితమే.
జైలుకు వెళ్ళిన పట్టాభి, తక్కువ సమయంలోనే బెయిల్ పొందగలిగారు. అనంతరం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు కూడా. విడుదలయ్యాక, ఇంటికి వెళుతున్న సమయంలో.. పట్టాభి మీడియాతో మాట్లాడలేదు. అయితే, మార్గ మధ్యంలో ఆయన ఆచూకీ గల్లంతయ్యింది.
‘పట్టాభిపై పోలీసులు నిఘా పెట్టారు.. ఆయన్ని అదను చూసి ఇంకోసారి అరెస్టు చేశారు. పట్టాభి ఆచూకీ తెలియక అయోమయంలో వున్న టీడీపీ శ్రేణులు..’ అంటూ టీడీపీ అనుకూల మీడియాలోనే తొలుత బ్రేకింగ్ న్యూసులు వచ్చాయి. అంతలోనే, ‘పట్టాభి క్షేమం.. టీడీపీ శ్రేణులకు అందిన సమాచారం..’ అని మళ్ళీ టీడీపీ అనుకూల మీడియాలోనే ప్రచారం జరిగింది.
ఇంతకీ పట్టాభి ఎక్కడ.? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి నేరుగా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు.? ఈ ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తనను ఇంకోసారి అరెస్టు చేస్తారన్న భయంతో, పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్ళారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం.
ముఖ్యమంత్రిపై దూషణలతోపాటు, పట్టాభికి సంబంధించిన అనేక వ్యవహారాలపై కేసులు నమోదయినట్లుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టాభి ఆచూకీ బయటపడితే, ఇంకోసారి ఆయన అరెస్టు అవడం ఖాయమేనేమో. కానీ, ముఖ్యమంత్రిని దూషించిన కేసులోనే సులువుగా బెయిల్ పొందిన పట్టాభి, కేసులకు భయపడే రకమా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న.