Tollywood : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా వివాదం ముదిరి పాకాన పడుతోంది. సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించడం ద్వారా సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు ఓ వైపు, పరిశ్రమ పెద్దల కోరిక మేరకే సినిమా టిక్కెట్లు, థియేటర్ల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతామంటున్న ప్రభుత్వ వాదన ఇంకో వైపు.. వెరసి, ఈ వివాదం మొత్తంగా సినీ పరిశ్రమలో అలజడికి కారణమయ్యింది.
ఇంతకీ, తెలుగు సినీ పరిశ్రమ పెద్దలెక్కడ.? ‘అఖండ’ విడుదల సమయంలోనూ ఈ చర్చ తెరపైకొచ్చింది. ‘పుష్ప’ సినిమా విషయంలోనూ అదే చర్చ జరిగింది. కానీ, ‘శ్యామ్ సింగారాయ్’ దగ్గరకు వచ్చేసరికి అదికాస్తా రచ్చగా మారింది. బెనిఫిట్ షోలు లేవు, అదనపు షోలు అసలే లేవు.. టిక్కెట్ల ధరల్ని పెంచుకోవడానికి లేదు. అయినా, పరిశ్రమ పెద్దలు మాట్లాడటంలేదు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున అయినా ఇప్పటిదాకా ఓ స్పందన రాకపోవడం ఆశ్చర్యకరం. నాని అనే ఓ హీరో, తన సినిమాకి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పాడు.. మరి, ‘మా’ అసోసియేషన్ ఏం చేస్తోంది.? నాని తప్పు చేశాడనో, సరిగ్గా మాట్లాడాడనో.. ఏదో ఒకటి చెప్పాలి కదా.?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. అంటే, సినిమా విషయాలు తమకేమీ పట్టవు.. సభ్యులకు సంబంధించి సంక్షేమం గట్రా చూసుకుంటామని మాత్రమే అనాలనుకుంటోందా.? నిర్మాతల మండలి ఏం చేస్తోంది.? సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలు ఏం చేస్తున్నాయి.?
అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతివ్వాలి.. లేదంటే, తమ సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. ఇవేవీ కుదరకపోతే, పరిశ్రమ తరఫున గట్టిగా డిమాండ్ చేయాలి. ఇవేవీ జరగకపోవడం ఆశ్చర్యకరమే.