పవన్‌పై విమర్శలతో పోసానికి కలిగే లబ్ది ఏంటి.?

ప్రజారాజ్యం పార్టీ సమయంలో మెగాస్టార్ చిరంజీవి మీద రోజా నానా రకాలైన విమర్శలు చేశారు. మరి, ఆమెకు కలిగిన లబ్ది ఏంటి.? తెలుగుదేశం పార్టీ ఆమెను రాజకీయంగా వాడుకుని వదిలేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆమె తన కల నెరవేర్చుకున్నారు.. ఎమ్మెల్యే అయ్యారు. కానీ, మంత్రి పదవి మాత్రం ఆమెను వరించలేకపోయింది. నిజానికి, రోజా వ్యవహారం.. రాజకీయాల్లో చాలామందికి ఓ గుణపాఠంగా చెప్పుకోవాలి.

ఏ పార్టీకి చెందినవారైనాసరే.. గట్టిగా అరిచినంతమాత్రాన రాజకీయాల్లో రాణించలేరు.. అది పవన్ కళ్యాణ్ అయినాసరే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయానికొద్దాం. నానా రకాల బూతులూ మాట్లాడేశారు పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో. విద్యార్హత కోణంలో చూస్తే, పోసాని కృష్ణమురళి విద్యాధికుడు.. పవన్ కళ్యాణ్‌తో పోల్చి చూసినప్పుడు.

కానీ, పవన్ కళ్యాణ్ కూడా ఓ పార్టీ అధినేతగా వున్నప్పుడు తన స్థాయిని దిగజార్చుకునేలా తిట్ల దండకం అందుకోకూడదు. కిందిస్థాయి నేతలు ఆ పని చేస్తే అది వేరే లెక్క. పవన్ ఎవర్నో ఏదో అన్నాడని పోసాని కృష్ణమురళికి కోపమొచ్చింది. మరి, నేరుగా పవన్ కళ్యాణ్ మీదనే విమర్శలు చేస్తే.. పవన్ కళ్యాణ్‌కి కోపం రాదా.? అన్నది ఇంకో కోణం. కోపతాపాలుంటే.. సభ్య సమాజం ఏమనుకుంటుందోనన్న సోయతో వ్యవహరించాలి.. వాటిని అదుపులో పెట్టుకుంటూ, ప్రత్యర్థులకు సమాధానమివ్వాలి.

ఇంతకీ, పోసాని కృష్ణమురళి సాధించేదేంటి.? వైఎస్ జగన్ హయాంలో మంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కుతుందా.? ఏదన్నా నామినేటెడ్ పదవి పొందగలుగుతారా.? కేవలం జగన్ మీద అభిమానంతోనే పోసాని ఇంత రిస్క్ చేస్తున్నారని అనుకోగలమా.? రేప్పొద్దున్న పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయి.. వైసీపీ, జనసేన పొత్తు కుదిరితో పోసాని పరిస్థితేంటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. వైసీపీ – జనసేన కలవడం అసాధ్యం.. అయినాగానీ, రాజకీయాల్లో శాశ్వత శతృత్వం.. శాశ్వత మితృత్వం వుండదు. ఇప్పటికే చాలా పార్టీలు మారిన పోసానికి ఆ విషయం తెలియదని ఎలా అనుకోగలం.?