AP Govt Employees Strike : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమ్మె జరిగితే ఏమవుతుంది.?

AP Govt Employees Strike : ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది.. కానీ, ఉద్యోగ సంఘాలు మొండికేస్తున్నాయి. పీఆర్సీ జీవో వెనక్కి తీసుకుని, పాత జీతాలే ఇస్తామని ప్రభుత్వం ప్రకటన ఇస్తే తప్ప ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్నది ఉద్యోగ సంఘాల నేతల వాదన. ప్రభుత్వం మాత్రం, తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమీ, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకు సిద్ధంగా వున్నామనీ, వారి సమస్యల్ని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో వున్నామనీ చెబుతుండడం గమనార్హం.

నిజానికి, పీఆర్సీ జీవోని వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటన చేస్తే, ప్రస్తుతానికి వివాదమే వుండదు. కానీ, ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, దాన్నుంచి వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. దాంతో, ఉద్యోగులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ‘పాత జీతాలే కావాలి..’ అని ఉద్యోగ సంఘాలు అంటోంటే, 20 వేల కోట్ల భారం పడుతున్నా, కొత్త పీఆర్సీ, కొత్త జీతాలంటోంది.

మామూలుగా అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వెనక్కి తగ్గాలి. ఎందుకంటే, ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో నిధులు మిగులుతాయి గనుక. కానీ, ప్రభుత్వమెందుకు మొండికేస్తోంది.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఒకవేళ ఉద్యోగులు అంటూ సమ్మెకి వెళితే, పరిణామాలు చాలా తీవ్రంగా వుండబోతున్నాయి. కోవిడ్ పాండమిక్, రాష్ట్ర ఆర్థిక స్థితి.. వీటన్నిటినీ లెక్కల్లోకి తీసుకుంటే, ఉద్యోగులు సమ్మె చేయడం అస్సలేమాత్రం సబబు కాదు. ‘కానీ, తప్పనిసరి’ అంటున్నాయి ఉద్యోగ సంఘాల నేతలు.

తెగేదాకా ఇరువురూ లాగుతున్నారు.. చివరికి తెగిపోయేవి ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులే. ఇక్కడ బేషజాలు అనవసరం. ప్రభుత్వమూ దిగి రావాలి.. ఉద్యోగులూ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళాలి. కానీ, అది సాధ్యమేనా.? అన్నది ప్రస్తుతానికైతే చిక్కు ప్రశ్నే.