వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారని చాలారోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. షర్మిలకు, జగన్ కు నడుమ పొరపచ్చాలు పెరిగాయని, కుటుంబ కలహాలు ఉన్నాయని ప్రచారం నడిచింది. జగన్ జైలులో ఉండగా పార్టీ బాధ్యతలను భుజానవేసుకున్న షర్మిల జగన్ బయటకు రాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లో లేకుండా పోవడం అనేది ఈ అనుమాలంటికీ తావిచ్చింది. ప్రత్యర్థి పార్టీలు కూడ ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు. ఈ క్రమంలోనే షర్మిల కొత్త పార్టీ పుకార్లు పుట్టుకొచ్చాయి. దానికితోడు తెలంగాణలోని పలువురు నేతలు సైతం షర్మిల పార్టీ వార్తలపై స్పందించారు కూడ.
ఇక ఎల్లో మీడియా అయితే షర్మిల పార్టీ పెట్టడం ఖాయమని టీవీలు బద్దలయ్యేలా చెప్పింది. ఎప్పుడు, ఎలా, ఎందుకు అనే విషయాలను పూసగుచ్చునట్టు పత్రికలో సవివరంగా తెలియజేశారు ఆర్కే. కానీ ఆర్కేకు జగన్ కుటుంబం అంటే అస్సలు పడదు కాబట్టి వాటిని నమ్మవద్దని వైసీపీ శ్రేణులు వ్యతిరేకించాయి. షర్మిల కూడ ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను అనడంతో ఆర్కే బురద చల్లుడు కార్యక్రమం మానలేదని, అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు పెడుతున్నారని అనుకున్నారు అందరూ. కానీ సీన్ మారిపోయింది. ఆర్కే మాటలే నిజమయ్యేలా ఉన్నాయి.
లోటస్ పాండ్‌లోని బ్రదర్ అనిల్ కార్యాలయంలో రేపు షర్మిల కీలక సమావేశం నిర్వహించనున్నారని, ఇప్పటికే కీలక నేతలతో మన్తానలు ముగిశాయని, పార్ట్ ఏర్పాటు మీద స్పష్టత ఉందని వార్తలు జోరందుకున్నాయి. వీలైతే రేపే పార్టీని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. షర్మిల త్వరలో చేవెళ్ల నుండి పాదయాత్ర చేసే ఏర్పాట్లు కూడ జరుగుతున్నాయని సమాచారం. మొత్తానికి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం కాదని, ఆ వార్తల వెనుక ఆర్కే వద్ద పక్కా సమాచారం ఉందని స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చంద్రబాబు విషయంలో రాధాకృష్ణ మాటలను భజన మాటలని లైట్ తీసుకున్నా జగన్ విషయంలో చెప్పే వాటిని మాత్రం పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అర్థమవుతోంది.