Rate of Prashanth Kishore : రాజకీయ వ్యూహకర్త అనండీ.. ఎన్నికల వ్యూహకర్త అనండి.. లేదూ, పొలిటికల్ బ్రోకర్ అనండీ.! పేరు ఏదైతేనేం, ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ఆయన తెర మీద కనిపించడు. తెర వెనుకాల వ్యవహారాలు చక్కబెట్టేస్తాడు. దటీజ్ ప్రశాంత్ కిషోర్.
అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని నిర్ధారించుకున్నాకనే ఏ పార్టీ కోసమైనా ఆయన పని చేసేందుకు సిద్ధమవుతాడా.? లేదంటే, ఎలాగైనా ఓ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నానా రకాల అడ్డదార్లూ తొక్కేస్తాడా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన ‘రేటు’ మాత్రం చాలా చాలా హాటు.!
ఇంతకీ, ప్రశాంత్ కిషోర్ రేటెంత.? ‘అబ్బే, ఆయన డబ్బుల కోసం పని చేయడు. చాలా మంచోడు. దేశ రాజకీయాలపై అవగాహన వున్నోడు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా సెలవిచ్చారు.
అద్గదీ సంగతి, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారన్నమాట. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పొచ్చుగాక. కానీ, డబ్బులు తీసుకోకుండా ఈ రోజుల్లో ఎవడైనా పని చేస్తాడా.? పైగా, రాజకీయం – అధికారం.. వీటి చుట్టూ నడుస్తుంది ప్రశాంత్ కిషోర్ పని. సో, లక్షల్లో కాదు, కోట్లలోనే వుంటుంది పారితోషికం.
గతంలో జరిగిన ప్రచారాన్నే తీసుకుంటే, ఓ రాస్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు ఐదొందల కోట్ల రూపాయల డీల్ సెట్ చేసుకుందట ప్రశాంత్ కిషోర్ టీమ్. ఈ ఆరోపణల్ని ప్రశాంత్ కిషోర్ బృందం.. అదేనండీ ఐ ప్యాక్ టీమ్ ఏనాడూ ఖండించలేదు. కానీ, ఉత్త పున్నేనికే ప్రశాంత్ కిషోర్ తమతో కలిసి పని చేస్తున్నాడని కేసీయార్ చెబితే ఎలా నమ్మేది.?