విశాఖ ఉక్కు పోరుకి మద్దతు: ఏం స్కెచ్ వేసినవ్ కేటీఆర్.!

What is KTR Plan

What is KTR Plan

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అత్యంత వ్యూహాత్మకంగా సీమాంధ్ర ఓటు బ్యాంకు కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరుకి మద్దతు పలికేశారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. ఇలా ఆయన మద్దతిచ్చారో లేదో అలా అక్కడ విశాఖ ఉక్కుపోరులో కార్మికులు కేటీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసేశారు. ఇదెక్కడి చోద్యం.? గతంలో బయ్యారం ఇనుప గనుల నుంచి విశాఖకు ముడి ఇనుముని తరలించేందుకు ఏర్పాట్లు జరిగితే, అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది టీఆర్ఎస్. ‘బయ్యారం స్టీల్ ప్లాంటు కట్టి, దానికే ఆ గనుల్ని కేటాయించాలి’ అని టీఆర్ఎస్ తేల్చి చెప్పింది. ఆ సమయంలో ఆ గనుల కేటాయింపు విశాఖకు జరిగి వుంటే, ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ భూతం తమ మీద వచ్చి పడేదే కాదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి తాను కూడా విజ్ఞప్తి చేస్తానని గతంలో కేసీఆర్ చెప్పారు. అదే నోటితో, ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, మా తెలంగాణ ఏమైపోవాలి.?’ అంటూ రివర్స్ గేర్ వేసేశారు కేసీఆర్. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ విషయంలో మద్దతివ్వడం బాగానే వుందిగానీ, రేప్పొద్దున్న రివర్స్ గేర్ వేస్తేనో.! వెయ్యకుండా ఎందుకుంటారు.? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోతుంది. అవసరానికి తగ్గట్టు రాజకీయ వ్యూహాల్ని మార్చడంలో టీఆర్ఎస్‌కి ఇంకెవరూ సాటి రారు. ఊసరవిల్లి రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అన్నది గులాబీ పార్టీపై వున్న విమర్శ. అంతెందుకు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా గులాబీ పార్టీ, డబుల్ టోన్ వినిపిస్తూ వస్తుంటుంది. ఇదిలా వుంటే, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా వున్న మాటే చెబుతారనీ, ఆఫర్ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే పరిస్థితులు మారాక ప్రయోజనమేంటి.? అన్నది గులాబీ పార్టీ నేతలు చెబుతన్న వెర్షన్.