వైసీపీ, టీడీపీ దోచేస్తోంటే బీజేపీ ఏం చేస్తోంది.?

What BJP is Doing if tdp and YCP Loots

రాజకీయాల్లో దోపిడీ సర్వసాధారణం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ‘అవినీతి రహిత పాలన అందిస్తున్నాం’ అనే చెబుతాయి. కానీ, ఇది ‘నేతి బీరకాయలోని నెయ్యి’ చందమే. అవినీతి అనేది వ్యవస్థలోతుల్లోకి వేళ్ళూనుకుపోయింది. అవినీతి గురించి ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు మాట్లాడినా అదో ‘బూతు’గా మారిపోయిందన్న ఆవేదన ప్రజాస్వామ్యవాదుల్లో బలపడిపోయింది.

అసలు విషయానికొస్తే, చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. వైసీపీ హయాంలోనూ అదే అవినీతి కొనసాగుతోందన్నది బీజేపీ వాదన. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఈ రోజు మీడియా ముందుకొచ్చి.. రెండు పార్టీలూ అవినీతి విషయంలో తోడు దొంగలే.. అని తేల్చి చెప్పేశారు.

What BJP is Doing if tdp and YCP Loots
What BJP is Doing if tdp and YCP Loots

బీజేపీ ఏం చేస్తున్నట్లు.?

ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద చంద్రబాబు హయాంలో 45 వేల కోట్ల రూపాయల్ని కేంద్రం కేటాయించిందనీ, అందులో వేల కోట్లు దోపిడీకి గురయ్యిందనీ, ఎమ్మెల్యేలు లోకల్‌గా దోచేసుకున్నారనీ సోము వీర్రాజు ఆరోపించేశారు. అదే దోపిడీ ఇప్పుడూ కొనసాగుతోందనీ, వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధుల్ని దోచేసుకుంటున్నారనీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర పథకాలకు సంబంధించి గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతోందో తమ కార్యకర్తల ద్వారా లెక్కలు తీస్తున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామనీ సోము వీర్రాజు చెప్పారు. రాజకీయ విమర్శల వరకూ సోము వీర్రాజు వ్యాఖ్యల్ని తప్పు పట్టలేం. కానీ, కేంద్రం ఏం చేస్తోంది.? అన్నదే కీలకమైన ప్రశ్న ఇక్కడ.

కేంద్రానికి బాధ్యత లేదా.?

కేంద్రం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయంటే, ప్రశ్నించాల్సింది ఎవరు.? కేంద్రమే కదా.! వేల కోట్ల దోపిడీ జరిగితే, కేంద్రమే రంగంలోకి దిగి.. జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో ఈ అవినీతి అనకొండల ఆటకట్టించాలి. లేదూ, ఇదంతా ఉత్త రాజకీయ ఆరోపణే అయితే, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ, ప్రజలకు వాస్తవాలు తెలియాలి.

ఎందుకంటే, అటు కేంద్రం ఇచ్చినా.. ఇటు రాష్ట్ర నిధుల నుంచి వెచ్చించినా.. అదంతా ప్రజల సొమ్మే. గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ ‘ఏటీఎం’ ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వంపై చేశారు. ఆ ఆరోపణలకు తగిన విచారణ కూడా జరగలేదు. గతంలో బీజేపీ – టీడీపీ కలిసి పనిచేశాయి కాబట్టే, విచారణలు వుండట్లేదా? అన్న విమర్శలకు సమాధానం ఎవరు చెబుతారు.?