సుజనా చౌదరి చాలా ముఖ్యమైన రాజకీయ నాయకుడు. మొన్నటి వరకు టీడీపీలో చంద్రబాబు నాయుడుకు ఎంతో నమ్మకంగా ఉన్న సుజనా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అయితే గత రెండు రోజుల నుండి సుజనా చౌదరి వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వుండగా, ఎంపీ సుజనా చౌదరిని ఎయిర్ పోర్ట్‌లో అధికారులు అడ్డగించారన్నది నిన్న ప్రచారంలోకి వచ్చిన ఓ వార్త. అయితే, సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో, ఆయనకు ఊరట లభించిందన్నది ఇంకో వార్త. ఇలా సుజనా వార్తల్లో నిలుస్తున్నారు.
సుజనాను వెనకేసుకొస్తున్న టీడీపీ మీడియా
ఈ వివాదంలో సుజనాను టీడీపీ అనుకూల మీడియా వెనకేసుకొస్తుంది. ఓ తప్పుడు కేసులో లుక్ ఔట్ నోటీసులు ఇప్పటికే ఆయనపై వున్నాయని, అందుకే పోలీసులు ఆపరని కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే సుజనా కార్యాలయం నుండి కూడా ఇవే వార్తలు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీలో ఉన్న సుజనా ఇంకా టీడీపీ అనుకూల మీడియాతో సన్నిహితంగా ఉండటం వల్లే ఇలా అనుకూల కథనాలు ప్రసారం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
భవిష్యత్ లో బీజేపీని టీడీపీతో కలుపుతాడా!!
కేవలం వైసీపీ చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాల నుండి తప్పించుకోవడానికి మాత్రమే సుజనా బీజేపీలోకి వెళ్లాడని రాజకీయ వర్గాలు చెప్తున్నా మాట. ఆయనకు ఇప్పటికి టీడీపీపై, చంద్రబాబు నాయుడుపై ప్రేమ ఉందని సుజనా వ్యాఖ్యలను చూస్తుంటే అర్ధమవుతుంది. అలాగే టీడీపీని , బీజేపీని కలిపి రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి సుజనా కృషి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సుజనాను బీజేపీ దూరం పెడుతుందా!!
బీజేపీలో చేరినప్పటి నుండి చాలా కేసుల నుండి సుజనా చౌదరి ఎలా బయటపడుతున్నారో అందరికి అర్ధమవుతుంది. కానీ బీజేపీ నాయకులు మాత్రం సుజనా చౌదరిని కావాలనే దూరం పెడుతున్నారని సమాచారం. బీజేపీని టీడీపీలో కలపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు నచ్చకపోవడం వల్లే బీజేపీ నాయకులు సుజనాను పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత సుజనాకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని సమాచారం.