వెస్టిండీస్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్ మరోసారి తన విధ్వంసక హిట్టింగ్‌తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ఆంటిగ్వా వేదికగా శ్రీలంకతో తాజాగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ అఖిల ధనంజయకి చుక్కలు చూపించేసిన కీరన్ పొలార్డ్ (38: 11 బంతుల్లో 6×6).. ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించగా తాజాగా రెండో క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ నిలిచాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ ఘనత సాధించాడు. అయితే , దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హర్ష్‌లీ గిబ్స్ 2007లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో గత రాత్రి జరిగిన టీ20 మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. అఖిల ధనంజయ బౌలింగులో ఆరు బంతులను వరుసగా స్టాండ్స్‌లోకి పంపి గిబ్స్, యువరాజ్ సరసన చేరాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ పొలార్డ్ మెరుపులతో 13.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మొత్తం 11 బంతులు ఆడిన పొలార్డ్ 38 పరుగులు చేశాడు. అందులో 36 పరుగులు సిక్సర్ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం. ధనంజయ బౌలింగ్‌ను చితకబాదిన పొలార్డ్ ఆ తర్వాతి ఓవర్‌లోనే అవుటయ్యాడు.