జూమ్ పని చేయడంలేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలామందికి చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై స్పందించాల్సిన స్థాయిలో స్పందించకపోవడంతో. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలు అనేసి ఊరుకున్నారు చంద్రబాబు ఈ వ్యవహారంపై. నిజానికి, తొమ్మిదేళ్ళు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై సంపూర్ణ అవగాహన కలిగే వుంటారు. కానీ, ఆయన పూర్తిస్థాయి మౌనం దాల్చుతున్నారు ఈ వివాదంపై. ఇది కేసీయార్, వైఎస్ జగన్ కలిసే తెరపైకి తెచ్చిన వివాదం.. అన్న భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. కానీ, ఇది రాజకీయ వివాదం కాదు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. బోల్డంతమంది రైతులకు సంబంధించిన సమస్య. తాగు నీరు, సాగు నీరుకి సంబంధించిన వివాదం. బాధ్యతగల సీనియర్ పొలిటీషియన్ అయితే, చంద్రబాబు ఇప్పటికే ఈ వివాదంపై స్పందించాల్సిన స్థాయిలో స్పందించి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఓ మంచి సందేశం పంపించగలగాలి.. సమస్య పరిష్కారం కోసం తనదైన సూచనలు చేసి వుండాలి. కానీ, ఏపీ టీడీపీ నేతలు అగ్నికి ఆజ్యం పోసేటట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ టీడీపీ నుంచి అసలు స్పందించడానికే ఎవరూ లేరనుకోండి.. అది వేరే సంగతి. కాగా, చంద్రబాబు తెలంగాణకి గతంలో మోకరిల్లడం వల్లే ఈ దుస్థితి.. అంటోంది వైసీపీ. పోనీ, దానిపైన అయినా చంద్రబాబు స్పందించరేం.? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. బహుశా తాను మాట్లాడితే వివాదంలో ఇరుక్కుపోవాల్సి వస్తుందని చంద్రబాబు తెలివిగా, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అనుకోవాలేమో.