‘880 అడుగుల పైన శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు వుంటేనే, మేం రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్ళగలుగుతాం. అదే, తెలంగాణ రాష్ట్రమైతే, అంతకన్నా తక్కువ.. 800 అడుగుల కంటే తక్కువ నీళ్ళు శ్రీశైలంలో వున్నా, తెలంగాణకు నీటిని తరలించుకుపోగలదు.. అందుకే, రాయలసీమ లిఫ్ట్ ద్వారా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ద్వారా మా వాటా నీటిని తీసుకోవాలనుకుంటున్నాం. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో కొందరు నాయకులు ఎందుకు ఆక్షేపిస్తున్నారో అర్థం కావడంలేదు.
మితి మీరి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం వుండదు. మేం సంయమనం పాటిస్తున్నాం, తెలంగాణ నాయకులూ సంయమనం పాటించాలని కోరుతున్నాం..’ అంటూ ఈ రోజు వైఎస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై. ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలుండేవనీ, ఆ మూడు ప్రాంతాలకూ విడి విడిగా నీటి కేటాయింపులు అప్పట్లోనే వున్నాయనీ, ఆ కేటాయింపులకు వ్యతిరేకంగా తెలంగాణ మాట్లాడటం బాధాకరమని, దీన్ని ఎవరూ హర్షించరని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అయితే, వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి హోదాలో, కేంద్రానికి లేఖలు రాయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే, తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా కృష్ణా నది నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా సముద్రంలోకి వృధాగా వదిలేస్తున్న విషయం విదితమే. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకోలేని పరిస్థితి. కానీ, తెలంగాణ మాత్రం ఆయా ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా లాభం పొందుతూనే వుంది. ఏపీ సీఎం జగన్ ఈ విషయమై కీలకమైన, కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు.