తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి కేంద్రం తనదైన స్టయిల్లో బ్రేకులేసింది. అలాగని, ఇక్కడితో వివాదం సమసిపోయిందని అనుకోలేం. అసలు కథ ఇప్పుడే మొదలైంది. కేంద్రం నిర్ణయాన్ని ఏపీ స్వాగతిస్తోంటే, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు కోరుతోంది తెలంగాణ. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమని ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించేశారు.
కృష్ణా, గోదావరి నదుల బోర్డుల్ని, వాటి పరిధుల్ని కేంద్రం ప్రకటించేశాక, కేసీయార్ అయినా వైఎస్ జగన్ అయినా ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం వుండదు. అందుకేనేమో, వైఎస్ జగన్ సైలెంటయిపోయారు.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించేశారు.
కానీ, కేసీయార్ రూటే సెపరేటు. పార్లమెంటు వేదికగా పోరాటం చేయాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. ‘మా నీరు మేం ఒక్క చుక్క కూడా వదులుకోం..’ అన్నది కేసీయార్ నినాదం. ‘మా వాటాకి అదనంగా ఒక్క చుక్క కూడా వాడుకోం..’ అన్నది వైఎస్ జగన్ నినాదం.
మరి, సమస్య ఎక్కడొస్తుంది.? అంటే, కేటాయింపుల్లోనే. అధికారిక కేటాయింపులేవీ లేవన్నది తెలంగాణ వాదన. విభజన చట్టం అమల్లోకి వచ్చాక ప్రకటితమైన కేటాయింపులే అధికారిక కేటాయింపులన్నది ఏపీ అభిప్రాయం. అయితే, కేంద్రం ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చెరి సగం.. అనే వాదనను కేసీయార్ తెరపైకి తెస్తున్నారు. అది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం.
తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నీళ్ళు రావాలి. ఇన్ని సమస్యల నడుమ.. కేసీయార్ గనుక పై చేయి సాధిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది. ప్రస్తుతానికైతే వైసీపీ – బీజేపీ మధ్య తెరవెనుక కాస్త సన్నిహిత సంబంధాలున్నాయి గనుక, ఏపీ వాదనకు కేంద్రం సమ్మతించే అవకాశం వుంటుంది. కేసీయార్ న్యాయపోరాటానికి పెద్దగా విలువ వుండకపోవచ్చు.