తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై చర్చించేందుకు సిద్ధంగా వున్నారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం విదితమే. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించి దాదాపు 40 టీఎంసీల నీళ్ళను నిల్వ చేయడం, మరికొన్ని టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు లిఫ్టు ప్రాజెక్టుల్ని నిర్మించడం వంటి కార్యాచరణకు తెలంగాణ సర్కార్ పూనుకున్న విషయం విదితమే.
తాజాగా, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి సర్వే కోసం అనుమతులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు శరవేగంగా పూర్తయిపోతుంటాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో నడుస్తోన్న పోలవరం ప్రాజెక్టుకీ.. నిర్మాణ సమయంలో వున్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం.
ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధి లేదు.. ఎవరు అధికారంలో వున్నా అదే జరుగుతోందక్కడ. తెలంగాణ రాష్ట్రం మాత్రం.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. చెయ్యాలనుకున్న పనులు చేసేస్తోంది. రేప్పొద్దున్న జోగులాంబ ఆనకట్ట గనుక నిర్మాణం ప్రారంభించుకుని, పూర్తయితే ఆంధ్రపదేశ్ పరిస్థితి ఏంటి.? అందుకే, ఈ వ్యవహారంపై ఆంధ్రపదేశ్ తక్షణ కార్యాచరణను ప్రకటించాలి.
శ్రీశైలం ఎగువన వున్న ఆర్డీయెస్ అలాగే రాయలసీమ లిఫ్టు ద్వారా నీటిని రాయలసీమకు సమర్థవంతంగా తరలించాలని ఏపీ ప్రభుత్వం ఏళ్ళ తరబడి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడంలేదు. కానీ, తెలంగాణ మాత్రం.. అత్యంత వేగంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తోంది. ఈ విషయమై ఏపీ నిద్ర మత్తు వీడకపోతే.. భవిష్యత్తు భయానకంగా వుంటుందన్నది నిర్వివాదాంశం.