వివాదం ఎక్కువ రోజులు ముదరడం అనేది ఎవరికీ మంచిది కాదు. అక్కడ ఆ ప్రాజెక్టులు ఆపాలి.. ఇక్కడ ఈ ప్రాజెక్టులూ ఆపాలని కృష్ణా రివర్ బోర్డ్.. రెండు రాష్ట్రాలకూ స్పష్టం చేసిన దరిమిలా.. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి రావాల్సిందే. కేసీయార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమరావతిలో కలుస్తారా.? లేదంటే, వైఎస్ జగన్, కేసీయార్ ని కలిసేందుకు తెలంగాణకి వెళతారా.? అన్నదానిపై.. ఇరువురూ కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
ఎక్కడ కలిసినా సరే, ఆ కలయిక వీలైనంత త్వరగా జరగాలి. లేదంటే, వివాదం ముదిరి పాకాన పడటం రెండు రాష్ట్రాలకీ మంచిది కాదు. తెలంగాణ నుంచి అత్యంత దూకుడుగా మాటలు జారిపోతున్నాయి.. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మీద. అంటే, ఆంధ్రపదేశ్ ప్రజల మీదనే విద్వేషం.. అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అత్యంత వ్యూమాత్మకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ టార్గెట్ చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేసీయార్ – వైఎస్ జగన్.. ముఖ్యమంత్రుల హోదాల్లో భేటీ కావడం అనేది జరగకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ, ఇరు రాష్ట్రాల శ్రేయస్సుని పరిగణనలోకి తీసుకుని, ఇద్దరూ బేషజాలు పక్కన పెట్టాల్సి వుంది. ఏపీకి ఏం అవసరం.? అన్నది అక్కడి ప్రభుత్వానికి తెలియాలి. తెలంగాణకు ఏం కావాలన్నది ఇక్కడి ప్రభుత్వానికి తెలియాలి. రెండు ప్రభుత్వాలూ వివాదాలకు తావు లేని నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ నిర్ణయాలు త్వరగా జరగకపోతే, ఇవి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలుగా మారతాయి.. ప్రజల మధ్య విధ్వేషాలకు కారణమవుతాయి.