తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు. దీంతో అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకున్నది.
గత నెలలో కురిసిన వర్షాలకు వరంగల్ ఎంతలా మునిగిపోయిందో అందరూ చూశారు కదా. వరద నీటితో వరంగల్ రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఓ వారం దాక వరంగల్ లో ఎక్కడ చూసినా నీళ్లు. రోడ్ల మీద నీళ్లే. వరంగల్ మొత్తం వరద ముంపునకు గురవడానికి కారణం నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలే అని అధికారులు గుర్తించారు.
వరంగల్ వరద ముంపునకు గురవడంతో… మంత్రి కేటీఆర్ కూడా వరంగల్ ను సందర్శించి.. వరదలకు కారణాలను తెలుసుకొని వెంటనే తగిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాలాలపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే.. వరంగల్ వరద ముంపునకు గురవడానికి నాలాల ఆక్రమణతో పాటుగా.. చెరువుల స్థలాలను కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకోవడం, డ్రైనేజ్ సిస్టం సరిగ్గా లేకపోవడమేనని మున్సిపల్ అధికారులు గుర్తించారు.
వెంటనే నాలాలకు అడ్డుగా ఉన్న బిల్డింగులను కూల్చేస్తున్నారు. అయితే.. వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం కూడా నాలాకు అడ్డంగా నిర్మించి ఉంది. దీంతో 10 రోజుల క్రితమే క్యాంపు ఆఫీసుకు అధికారులు మార్కంగ్ ఇచ్చారు. సొంతంగా ఆఫీసును కూల్చేసుకోవాలని నోటీసులు పంపారు. అయినప్పటికీ ఎమ్మెల్యే నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో… ఆరూరి క్యాంపు ఆఫీసును అధికారులు కూల్చేశారు.
అయితే.. క్యాంపు ఆఫీసును అధికారులు కూల్చేస్తుండగా… ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా… టాస్క్ ఫోర్స్ ఆదేశాలతో కూల్చేస్తున్నామని.. అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించడంతో అనుచరులు వెనక్కి తగ్గారు.