తెలంగాణ లో మారిన రాజకీయాల నేపథ్యంలో తెరాస పార్టీ చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తుంది. ఎక్కడ కూడా ఆవేశ పడకుండా పరిస్థితులను గమనిస్తూ ముందుకు వెళ్తుంది. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. భారతీయ జనతా పార్టీ నేతలు సైలెంట్ అవుతారని అనుకున్నారు. కానీ.. ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్.. కేసీఆర్ మీద.. ఎన్నికల ముందు కన్నా ఘాటుగా విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా.. జైలుకు పంపకుండా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసేశారు. హైదరాబాద్‌లో ఉన్న కిషన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. టీఆర్ఎస్‌తో దోస్తీ చాన్సే లేదని తేల్చేశారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ నేతలు మాత్రం భారతీయ జనతా పార్టీపై సైలెంట్ అయిపోయారు. ఒక్కరంటే ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇక తెలంగాణలో ఆ బాధ్యతను డీకే అరుణ తీసుకోని కేసీఆర్ పై విమర్శలు చేసింది.
ఒక పక్క బీజేపీ నేతలు ఇంతగా రెచ్చిపోతున్న కానీ తెరాస నేతలు సైలెంట్ గా వుంటున్నారు. రైతులకు మద్దతుగా భారత్ బంద్ ప్రభుత్వ పరంగా చేయించే వరకూ… భారతీయ జనతా పార్టీ నేతలపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడేవారు. మోడీ దగ్గర్నుంచి అందర్నీ విమర్శించారు. మోడీపాలనలో దేశం నాశనమైపోయిందన్నారు. వ్యవసాయ చట్టాలు రైతుల్ని ఆగం పట్టిస్తాయని విమర్శలు గుప్పించారు. భారత్ బంద్ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం పడిపోయింది.
ఇక కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా తెరాస నేతలు మౌనం పాటిస్తున్నారు. ఈ మౌనం వెనుక కేసీఆర్ ఇచ్చిన సృష్టమైన సంకేతాలు ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ నేతలపై మాత్రం విమర్శలు చేయవద్దన్న సంకేతాలు టీఆర్ఎస్ నేతలకు అందినట్లుగా తెలుస్తోంది. సీఆర్‌ను విమర్శించడానికి ఏ చిన్న కారణం దొరికినా వదిలి పెట్టాలనుకోవడం లేదు. బీజేపీ నేతలు అన్నన్ని మాటలు అంటున్నా… తాము సైలెంట్‌గా ఉంటే బాగోదని… ప్రతి విమర్శ చేయకపోతే.. లొంగిపోయామన్న భావనకు ప్రజలు వస్తారన్న ఆందోళనలో ఉన్నారు.
ఇదే సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన నాటి నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రి కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ కి వెళ్లి, ప్రస్తుతం పరిస్థితుల్లో బీజేపీ విషయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి తదుపరి కార్యాచరణ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.