అమరావతిని తిరస్కరించిన ఓటర్లు

Government sudden love on Amaravathi

Voters rejecting Amravati

నిన్న వెలువడిన నగరపాలక, పురపాలక ఎన్నికల ఫలితాలు విపక్షాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనలకు ఏకపక్షంగా ప్రజలిచ్చిన తీర్పును ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాయి. ఇక చంద్రబాబుకు ఏమి మాట్లాడాలో కూడా తోచలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ వాడుకోలేకపోయిందని కొందరు బీజేపీ ప్రతినిధులు వినిపించగా, ఓటర్లను బెదిరించి వైసిపి ఓట్లు వేయించుకున్నదనే అతి పేలవమైన వాదనను జనసేన వినిపించి ఎన్నికల ఫలితాల పట్ల ఎంత షాక్ కు గురయ్యామో చెప్పకనే చెప్పారు.

గతంలో ఏనాడూ కనీవినీ ఎరుగనివిధంగా ఈసారి స్థానిక సంస్థల ఫలితాలు వచ్చాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో ఎనభై శాతం స్థానాలు తమకు వచ్చాయని వైసిపి ప్రకటించగా, తమకు నలభై శాతం వచ్చాయని టిడిపి ఇరవైఐదు శాతం వచ్చాయని జనసేన ప్రకటించుకున్నాయి. అవి పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికలు కాబట్టి ఫలితాలకు ఎవరి చిత్తం వచ్చినట్లు వారు భాష్యం చెప్పుకుని తృప్తి చెందవచ్చు. కానీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు కాబట్టి ఈ ఫలితాలు వాస్తవ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో డెబ్బై ఒక్క మునిసిపాలిటీలకు గాను అరవై ఏడు మునిసిపాలిటీలలో నిన్నటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ వార్డులు మాత్రమే లభించాయి. అలాగే కార్పొరేషన్లలో కూడా పదకొండింటికి గాను పదింటిలో సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైపోవడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎంతగా ఛీత్కరించుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళ వయసులో కాలికి బలపం కట్టుకుని తిరిగి ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు ఏమాత్రం జాలి చూపించలేదు అంటే తెలుగుదేశం చరిత్రలో ఇంతకన్నా విషాదఘట్టం మరొకటి ఉండబోదు.

జనసేన పార్టీకి కూడా ఎన్నికల్లో ఘోరపరాభవం జరిగింది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కనీసం పాతిక వార్డులను కూడా జనసేన గెలుచుకోలేకపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రయివేటీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం, దాన్ని పవన్ కళ్యాణ్ సమర్ధించడంతో జనసేన ప్రజలకు దూరమైపోయింది. తెలుగుదేశం పార్టీతో జనసేనుడు రహస్య మైత్రిని కొనసాగిస్తున్నారనే సందేహాలు ప్రజల మనసులనుంచి తొలగిపోలేదు. పవన్ లో పోరాట లక్షణం లేదని, ప్రజలకోసం ఆయన ఉద్యమించడని, బీజేపీ లేదా తెలుగుదేశం ప్రయోజనాలకోసమే పవన్ పనిచేస్తారనే అభిప్రాయం ప్రజల మనస్సులో స్థిరపడింది. అందుకే పవన్ కళ్యాణ్ కు విశ్వసనీయత లేకుండా పోయింది.

ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన అతి ప్రధానమైన అంశం రాజధాని వికేంద్రీకరణ. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లను వైసిపి గెల్చుకుంటే తాము ఇక రాజధాని మార్పు గూర్చి మాట్లాడబోమని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కొన్నాళ్లక్రితం బాహాటంగా ప్రకటించారు. అమరావతి సెంటిమెంట్ ఆ రెండు జిల్లాల్లో బలంగా ఉన్నదని, పైగా అక్కడ తమ సామాజికవర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, గత ఏడాదిన్నరలో ఆవగింజంతైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉండకుండా ఉంటుందా అనే ధీమాతో చంద్రబాబు ఆ విధంగా ప్రచారం చేశారు. కానీ, గుంటూరు కార్పొరేషన్లో వైసిపి నలభై ఎనిమిది డివిజన్లు గెల్చుకోగా, తెలుగుదేశం కేవలం ఏడు డివిజన్లు మాత్రమే దక్కించుకుంది. దీన్నిబట్టి స్పష్టంగా విశదం అవుతున్నదేమిటంటే చంద్రబాబు ప్రతిపాదిత అమరావతి కేవలం చంద్రబాబు, ఆయన ముఠాకు ఒక భూవ్యాపారకేంద్రం మాత్రమేనని, అమరావతివలన తమకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదని ప్రజలు విశ్వసిస్తున్నారని. పైగా ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కనీసం ఇరవై శాతం కూడా రాజధానిని నిర్మించకుండా, కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఎల్లో మీడియా సహకారంతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తారని ప్రజలు తమ తీర్పులో స్పష్టం చేశారు. రాజధాని మార్పు అనేది సామాన్య ప్రజలకు అవసరం లేని విషయం అని ఓటర్లు చెప్పినట్లయింది.

విశాఖ కార్పొరేషన్, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు, కర్నూల్ కార్పొరేషన్ అనూహ్యమైన మెజారిటీతో వైసిపి కైవసం కావడంతో రాజధాని వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అనుమతిని ప్రసాదించారు. తమకు కావలసింది ప్రజారంజకమైన పరిపాలనే తప్ప ఇతర అంశాలు అవసరం లేదని బాలెట్ ద్వారా ఓటర్లు తెలియజేశారు. ఓటర్ల మనోభిప్రాయాన్ని శిరస్సున ధరించి రాజధాని వికేంద్రీకరణను వేగంగా పూర్తి చేసి దాని ఫలితాలను ప్రజలకు అందించి రాబోయే ఎన్నికల్లో వారి ఆశీస్సులు పొందటం అధికారపార్టీ బాధ్యత.

 

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు