బీజేపీకి ఓటేస్తే, పెట్రోల్ ధర 200 దాటుతుందన్న హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతల్లో ఒకరైన మంత్రి హరీష్ రావు, ఏదన్నా విషయమ్మీద మాట్లాడితే, కాస్తంత పద్ధతిగా మాట్లాడతారు. చాలా అరుదుగా మాత్రమే ఆయన మాట తూలుతుంటారు. దుబ్బాక ఉప ఎన్నికలో అన్నీ తానే అయి తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలనుకున్న హరీష్ రావుకి, అక్కడి ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పిన మాటల్ని జనం లెక్క చేయలేదు. బీజేపీకి అవకాశమిచ్చారు. దాంతో, తెలంగాణ రాష్ట్ర సమితికి మైండ్ బ్లాంక్ అయ్యింది. అయితే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర సమితి తన పట్టు నిలబెట్టుకుంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో అధికారం తెలంగాణ రాష్ట్ర సమితిదే అయినా, రాజకీయంగా లాభపడింది బీజేపీ.

తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా పెద్ద షాకిచ్చింది బీజేపీ ఆ ఎన్నికల్లో. ఇక, ఇప్పుడు హుజూరాబాద్ నియోraజకవర్గ ఉప ఎన్నిక సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటేస్తే, పెట్రోల్ ధర 200 దాటుతుందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఔనా.? మరి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేస్తే ఏమవుతుంది.? పెట్రోల్ ధర తగ్గుతుందా.? అలాగైతే, ఇప్పుడెందుకు తెలంగాణలో పెట్రోల్ ధర సెంచరీ దాటినట్లు.? పెట్రో ధరల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. కలిసే దోచుకుంటున్నాయి ప్రజల్ని. ఇందులో ఒకరు ఎక్కువా కాదు, ఇంకొకరు తక్కువా కాదు. హూజూరాబాద్ ఎన్నికల పేరు చెప్పి అయినా, తెలంగాణలో పెట్రో ధరలు తగ్గించేలా మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వగలిగితే, పెట్రో ధరలు తగ్గిస్తే.. తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్మడానికి వీలుంటుంది. ఒక్కటి మాత్రం నిజం.. పెట్రో ధరల జోరు చూస్తోంటే, 2024 ఎన్నికల నాటికి పెట్రోల్ ధర డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.