Vizag : రాజధానిపై విశాఖలో వైఎస్ జగన్ ప్రకటన చేస్తారా.?

Vizag : ఏం ఎందుకు కాకూడదు.? విశాఖ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అవడానికి అర్హత కలిగిన నగరం కాదని ఎవరైనా అనగలరా.? అయితే, అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన విశాఖపట్నం మొదటి నుంచీ ‘వెనక్కి నెట్టివేయబడుతూ’ వస్తోంది కుట్ర పూరిత రాజకీయాల కారణంగా.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే హైద్రాబాద్ తర్వాత విశాఖపట్నం అతి పెద్ద నగరం. అంతేనా, జాతీయ స్థాయిలో విశాఖపట్నం నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. ప్రపంచ స్థాయి పోర్టు.. యుద్ధ వ్యూహాల పరంగా నావికాదళానికి అత్యంత కీలకమైన ప్రాంతం.. ఇవి కాక అనేక జాతీయ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి.

రైలు, రోడ్డు కనెక్టివిటీ మాత్రమే కాదు.. ఎయిర్ కనెక్టివిటీ అలాగే, సీ కనెక్టివిటీ కూడా విశాఖకు అదనపు ఆకర్షణలు. మరి, ఇన్నీ వుండి విశాఖపట్నం ఎందుకు రాజధాని స్థాయిలో అభివృద్ధి చెందలేదు.? అంటే, ఆ ప్రశ్నకు సరైన సమాధానమే దొరకదు.

ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం.. అలా విశాఖపట్నం నగరాన్ని కూడా వెనక్కి నెట్టేశారు. వైఎస్ జగన్ హయాంలో విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తే, దానికి సవాలక్ష రాజకీయాలు అడ్డుపడ్డాయి. మూడు రాజధానుల చట్టం వెనక్కి తీసుకోవడంతో, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కల ఇక నెరవేరదని అంతా అనుకున్నారు.

అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో కీలక ప్రకటన చేయబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండడం ఉత్తరాంధ్రవాసుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. అయితే, విశాఖను రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తారా.? చూచాయిగా సంకేతాలు ఇస్తారా.? అన్నదానిపై మళ్ళీ భిన్నవాదనలున్నాయి.

ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో వున్న దరిమిలా, ‘ప్రకటన’ రాకపోవచ్చు.. చూచాయిగా సంకేతాలు అయితే ఇచ్చేందుకు ఆస్కారముంది. విశాఖ సంగతి సరే, కర్నూలు పరిస్థితేంటి.?